సీన్ మీద కంటే కూడా సీన్ వెనుక ఉండటం ప్రణబ్ దాకు అలవాటు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించటానికి ముందు.. కాంగ్రెస్ పార్టీలో కీలకభూమిక పోషించిన సమయంలో ఆయన తీరు మిగిలిన వారికి భిన్నంగా ఉండేది. ఆయన నివాసంలో మంతనాలు అర్థరాత్రి దాటిన తర్వాత కూడా జోరుగా సాగుతుండేది. ట్రబుల్ షూటర్ గా పేరున్న ఆయన.. పార్టీ ఇచ్చిన టాస్కును పూర్తి చేయటమే పనిగా పెట్టుకుంటారని చెబుతారు. ఎంతటి క్లిష్టమైన సమస్యను ఇచ్చినా.. ఇట్టే పూర్తి చేసే ఆయనకు సంబంధించి చాలా తక్కువ మందికి తెలిసిన వివరాలు కొన్ని ఉన్నాయి.

– ప్రణబ్ దా ఒకప్పుడు ప్రొఫెసర్ గా పని చేశారు.
– 1963లో ఆయన పశ్చిమబెంగాల్ లోని సౌత్ 24 పరిగణాల జిల్లా విద్యానగర్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ అభ్యసించారు.
– రాజకీయాలకు ముందు ఆయనో జర్నలిస్టు. స్థానిక బెంగాలీ వారపత్రిక డెషెర్ డాక్ లో ఆయన పని చేశారు.
– స్వర్గీయ ఇందిరా గాంధీ ఆయన్ను స్వయంగా రాజకీయాల్లోకి తీసుకెళ్లారు
– ఇందిరమ్మ హత్య తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి రాష్ట్రీయ సమాజ్ వాది పార్టీని ప్రారంభించారు
– ప్రయాణాలు చేయటం ప్రణబ్ దాకు చాలా ఇష్టం. దేశ విదేశాల్లోఆయన చూడని ప్రాంతాలు చాలా తక్కువ.
– పార్లమెంటులో ఏడు బడ్జెట్ లు ప్రవేశ పెట్టిన ఏకైక ఆర్థికమంత్రి ఆయనే
– ఎంత రహస్యం ఆయనకు చెప్పినా బయటకు పొక్కేది కాదు. కడుపులోనే దాచుకుంటారన్న పేరుంది. ఒకవేళ బయటకు వచ్చేది ఆయన పైపులో నుంచి పొగ మాత్రమేనని చమత్కరిస్తారు.
– కోల్ కతాలోని డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో గుమస్తాగా ఆయన కెరీర్ మొదలైంది. అధ్యాపకుడిగా పనిచేయటానికి ముందు ఆయనీ ఉద్యోగం చేసేవారు
– ప్రధానిగా పీవీ బాధ్యతలు చేపట్టిన సమయంలో కేంద్ర కేబినెట్ లో ఎవరు ఉండాలనే జాబితాను ఆయనే సిద్ధం చేశారు. అందులో అన్ని మంత్రిత్వ శాఖలకు పేర్లు రాసి.. ఆర్థికమంత్రి పేరు ఎదుట ఖాళీగా ఉంచారు. ఆ పదవికి తననే పిలుస్తారన్న ఉద్దేశంతో ఆయన ఆ పని చేశారు. అనూహ్యంగా ఆయన్ను ఎంపిక చేయకుండా మన్మోహన్ సింగ్ ను ఎంపిక చేశారు.
– కేంద్ర ఆర్థిక మంత్రిగా అవకాశం ప్రణబ్ కు మిస్ కావటానికి మన్మోహన్ కారణమైతే.. 2004లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశాన్ని ఆయనకు కాకుండా చేసింది కూడా మన్మోహనే కావటం విశేషం. రెండుసార్లు తనకు దక్కాల్సిన కీలక పదవులు మిస్ కావటానికి కారణమైన మన్మోహన్ ను ఆయన ఎప్పుడు ద్వేషించేవారు కాదు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *