పార్లమెంట్‌ సమావేశాలపై నోటిఫికేషన్‌ జారీ చేసిన రాష్ట్రపతి

By సుభాష్  Published on  1 Sep 2020 7:27 AM GMT
పార్లమెంట్‌ సమావేశాలపై నోటిఫికేషన్‌ జారీ చేసిన రాష్ట్రపతి

సెప్టెంబర్‌ 14 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ సమావేశాలు అక్టోబర్‌ 1తో ముగియనున్నాయి. కరోనా నేపథ్యంలో సమావేశాలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉభయ సభల సభ్యులు కరోనాకు బారిన పడకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు చేపట్టి సమావేశాలను నిర్వహించనున్నారు. ఉదయం 4 గంటల పాటు లోక్‌సభ, సాయంత్రం 4 గంటల పాటు రాజ్యసభ సమావేశాలు నిర్వహించాలని ఇది వరకు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి ప్రశ్నోత్తరాల సమయం ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి.

18 రోజుల పాటు సమావేశాల నిర్వహణ

మొత్తం 18 రోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నాయి. మరో వైపు కరోనా కారణంగా సమావేశాల నిర్వహణ కోసం ఉభయ సభల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భౌతిక దూరం నిబంధనలకు అనుగుణంగా సభ్యులకు సీట్లు కేటాయించనున్నారు.

ఈసారి ఉభయ సభల్లోనూ ఛాంబర్లు, గ్యాలరీలు సభ్యులకే సీట్లు కేటాయించననున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభలో 60 మంది సభ్యులు ఛాంబర్‌లో, మరో 51 మంది గ్యాలరీల్లో, మిగతా 132 మంది సభ్యులు లోక్‌సభలో కూర్చునేలా ఏర్పాట్లు చేయడం భారత పార్లమెంట్‌ చరిత్రలో 1952 తర్వాత తొలిసారి.

రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఇది వరకే సమావేశమై పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణపై చర్చించిన విషయం తెలిసిందే. ఛాంబర్లు, గ్యాలరీలను సైతం సభ్యులు కూర్చునే విధంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి.

Next Story
Share it