మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని మాజీ ఎంపీ వీ హనుమంతరావు అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఎంతో మంది మహిళలు రాజకీయంగా చైతన్యవంతులు అయ్యారని.. సాంకేతిక రంగంలో మహిళలు అబివృద్ది చెంది వారి కాళ్ళ మీద వాళ్లు నిలబడ్డారంటే.. అది రాజీవ్ గాంధీ కృషి ఫలితమేనని వెల్లడించారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాహుల్ గాంధీని నక్సలైట్ భావాలు ఉన్నాయని అనడాన్ని తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ దేశాన్ని ఐక్యం చేయడానికి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ది శాంతి యుత విధానం, సిద్ధాంతం అని స్పష్టం చేశారు.
కవితకు ఈడీ నోటీసులపై విచారణ జరుగుతుంది.. కాబట్టి నేను ఎలాంటి కామెంట్స్ చేయనని అన్నారు. మహిళా దినోత్సవం రోజు ఒక మహిళపై కామెంట్స్ చేయనని అన్నారు. గతంలో టీడీపీలో ఉన్న సుజానా చౌదరి లాంటి వారికీ నోటీసులు ఇచ్చారు.. బీజేపీలో జాయిన్ అవ్వగానే ఆ కేసు ఏమైందో అందరికి తెలుసని.. బీజేపీ రాజకీయం కోసం ఏమైనా చేస్తుందని విమర్శించారు. ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ దాడులు బీజేపీకి అలవాటేనన్నారు.