ఈడీ నోటీసుల‌పై స్పందించిన క‌విత‌.. తెలంగాణ త‌ల వంచ‌దు

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఈడీ జారీ చేసిన నోటీసుల‌పై ఎమ్మెల్సీ క‌విత స్పందించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 March 2023 11:08 AM IST
Delhi Liquor Scam, MLC Kalvakuntla Kavitha

క‌ల్వ‌కుంట్ల క‌విత‌

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ) భార‌త్ రాష్ట్ర స‌మితి(బీఆర్ఎస్‌) ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 9న విచార‌ణకు హాజ‌రు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఈడీ జారీ చేసిన నోటీసుల‌పై ఎమ్మెల్సీ క‌విత స్పందించారు. తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని, విచార‌ణ‌కు పూర్తిగా స‌హ‌క‌రించ‌నున్న‌ట్లు తెలిపారు. ముంద‌స్తు అపాయింట్‌మెట్ల దృష్ట్యా విచార‌ణ‌కు హాజ‌రు అయ్యే తేదీపై న్యాయ‌స‌ల‌హా తీసుకుంటాన‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

"ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఆధ్వ‌ర్యంలో ఈ నెల(మార్చి) 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టాము.

అయితే.. మార్చి 9న ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు జారీ చేసింది. చట్టాన్ని గౌరవించే ఓ పౌరురాలిగా దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో స‌హ‌క‌రిస్తా. అయితే.. ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్ల‌ రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటా.

ఇలాంటి చర్యలతో సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండ‌గ‌డుతూనే ఉంటాం. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతాము. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదు." అని ఎమ్మెల్సీ క‌విత అన్నారు.

Next Story