ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు సంస్థలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ).. తాజాగా భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేసింది. విచారణ కోసం గురువారం ఢిల్లీకి రావాలని అందులో పేర్కొంది.
మంగళవారం హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్ట్ చేసింది. కవితకు పిళ్లై బినామీ అని ఈడీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపింది. ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ముట్టజెప్పిన సౌత్‌గ్రూప్ గుప్పిట్లో ఉన్న ఇండోస్పిరిట్స్ సంస్థల్లో కవిత తరుపున అరుణ్ భాగస్వామిగా ఉన్నారంది. ఈ నేపథ్యంలో కవితకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా..
ఇదిలా ఉంటే.. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ కల్పించాలంటూ ఈనెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ధర్నాకు పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ కవిత.