భూపాలపల్లిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రపై దాడిని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు సభలు పెట్టొద్దు.. అంటే ఎలా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ దగ్గర మెప్పు పొందడనికి గండ్ర వెంకటరమణారెడ్డి దాడి చేయించాడని ఆరోపించారు. బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో మీటింగ్ లు పెడితే.. ఇలాగే కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేస్తే కేసీఆర్ ఒప్పుకుంటాడా అని ప్రశ్నించారు. రాళ్లు రువ్వడం, టమాటాలు వేయడం సరైన పద్దతి కాదని సూచించారు. ఇలాంటి చర్యలు మానుకొక పోతే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వస్తుందని హెచ్చరించారు.
పార్టీ మారిన గండ్ర వెంకటరమణారెడ్డి పై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని జోస్యం చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడడం మొదలైతే బీఆర్ఎస్ తట్టుకోలేదని.. ఈ సారి ఇలా జరిగితే పరిస్థితి మా చేతుల్లో ఉండదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇలాంటి సాంప్రదాయం మొదలు పెడితే సరికాదని సూచించారు.
భూపాలపల్లి సభలో పాల్గొని తిరిగి వెళుతూ చనిపోయిన చందూ నాయక్ మృతికి వీహెచ్ సంతాపం తెలిపారు. శ్రీచైతన్య కాలేజీ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య దారుణం అని ఖండించారు. విద్యార్థుల పట్ల కాలేజీ యాజమాన్యం సున్నితంగా వ్యవహరించాలన్నారు. హర్ట్ అయితే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీన్ని గమనించి కాలేజీ యాజమాన్యాలు నడుచుకోవాలని సూచించారు.