వాళ్లు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు, కానీ..టీపీసీసీ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

టీపీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్‌చాట్‌లో స్పందించారు

By Knakam Karthik
Published on : 5 Sept 2025 3:33 PM IST

Telangana, Hyderabad, Tpcc Chief Mahesh, Cm Revanthreddy, Congress, Brs, Kcr

వాళ్లు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు, కానీ..టీపీసీసీ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం విమర్శలతో కూడిన వ్యాఖ్యలు చేస్తూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాగా టీపీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్‌చాట్‌లో స్పందించారు.కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. ఇదే విషయంలో క్రమశిక్షణ తప్పితే చర్యలు మాత్రం ఉంటాయి..అని టీపీసీసీ చీఫ్ అన్నారు.

ఈ ఐదేళ్లు సీఎంగా రేవంతే..

రానున్న ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారని టీపీసీసీ చీఫ్‌ అన్నారు. 2028లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ అప్పుడు ఎవరు సీఎం అవుతారు అనేది అధిష్టానం నిర్ణయం, ఎమ్మెల్యేల నిర్ణయం..అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

త్వరలోనే నూతన కమిటీలు..

గ్రామ, మండల, జిల్లా కమిటీలు వారం,పది రోజుల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేయబోతున్నట్లు మహేశ్ కుమార్ తెలిపారు. లోకల్ బాడీ కంటే ముందే నామినేటెడ్ పోస్టులు భర్తీ ఉంటుంది. సంక్షేమ పథకాల విషయంలో చేతివాటం ఎవరు చూపించిన కఠిన చర్యలు ఉంటాయి. అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ప్రకటించడం క్యాబినెట్ నిర్ణయం..అని తెలిపారు.

అప్పుడే మాట్లాడితే కవితకు సెల్యూట్ చేసేవాడిని..

నేరెళ్ల ఘటనపై కవిత అప్పుడే మాట్లాడితే సెల్యూట్ చేసేవాడిని..అని మహేశ్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ చచ్చిన పాము లాంటిది. బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ తగాదాలు జరుగుతున్నాయి. కవిత హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి గురించి బయట పెట్టింది. కేసీఆర్ కుటుంబంలో మంచి లక్షణాలు ఉన్నాయి....అబద్ధాన్ని నిజం లాగ చెప్తారు. బీసీ రిజర్వేషన్లు బీసీ బిడ్డలకు నోటి దాకా వచ్చి ఆగడానికి కిషన్ రెడ్డి కారణం. బీజేపీ బీసీ నాయకులు ఎవరు కూడా మాట్లాడటం లేదు. కాళేశ్వరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కక్ష్య పూరిత చర్యలు అంటారని సీబీఐకి ఇచ్చాం. సీబీఐ ఈ విషయంలో అయినా నిష్పక్షపాతంగా పనిచేస్తుంది అనుకుంటున్నాం..అని టీపీసీసీ చీఫ్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో యూరియా కొరత లేదు..

కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగానే తెలంగాణకు యూరియా రాలేదు..అని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదు. దొరకదు అనే అనుమానంతో రైతులు ఎక్కువగా తీసుకుని వెళ్తున్నారు. యూరియా కొరతను రాష్ట్ర ప్రభుత్వం కవర్ చేస్తుంది..అని టీపీసీసీ చీఫ్‌ చిట్‌చాట్‌లో అన్నారు.

Next Story