తెలంగాణ రాజకీయాల్లో పెరిగిన హీట్..నేటి నుంచే అసెంబ్లీ సమావేశాలు
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
By - Knakam Karthik |
తెలంగాణ రాజకీయాల్లో పెరిగిన హీట్..నేటి నుంచే అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 10.30 గంటలకు ఉభయసభలు ప్రారంభం అవుతాయి. కాగా తొలి రోజు సభకు మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానుండటంతో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. అటు సభ ప్రారంభంకాగానే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనున్నట్లు అసెంబ్లీ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. ఇటీవల జారీ చేసిన పలు ఆర్డినెన్సులను సభ ముందు ఉంచనుంది.
తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (అమెండ్మెంట్) బిల్లు-2025, తెలంగాణ మున్సిపాలిటీ చట్ట సవరణ బిల్లు, గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన రెండు చట్టసవరణ బిల్లులను సీఎం రేవంత్ రెడ్డి సభ లో ప్రవేశపెట్టన్నారు. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ సమగ్ర శిక్ష (TSS) ఆడిట్ రిపోర్ట్ తో పాటు 2022-2023 పిఎం శ్రీ ఆడిట్ రిపోర్ట్ ను సీఎం సభలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్, వేతన సవరణకు సంబంధించిన రెండు బిల్లులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సభలో ప్రవేశపెడతారు. పంచాయతీ రాజ్ చట్టసవరలను తో పాటు ఎంపీపీ ,జడ్పిపి కి సంబంధించి ప్రచురించిన గెజిట్ ను మంత్రి సీతక్క సభలో ప్రవేశపెడతారు.
తెలంగాణ ఆర్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించి 2023-2024 సంవత్సరాల ఆడిట్ నివేదికలను మంత్రి తుమ్మల నాగేశ్వరావు సభలో ప్రవేశపెడతారు. ఇటీవల కాలంలో మరణించిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి మృతి పట్ల సంతాపం ప్రాకటిస్తారు. అనంతరం జీరో అవర్ ఉంటుంది. జీరో అవర్ తరవాత సభ జనవరి 2కు వాయిదా పడుతుంది. అనంతరం స్పీకర్ అధ్యక్షత న బిజినెస్ అడ్వైజరి కమిటీ సమావేశం జరిగిన తర్వాత సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేది నిర్ణయిస్తారు.