హైదరాబాద్: భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు అంటే బీజేపీ కి గౌరవం లేదు..అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. పహల్గాం మారణకాండకు కారణమైన పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడడం బీజేపీ కపట దేశభక్తికి నిదర్శనం అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. బీజేపీది నకిలీ జాతీయవాదం-జింగోయిజం, పాక్‌తో క్రికెట్ ఆడితే లేని నొప్పి..సుప్రీం తీర్పును స్వాగతిస్తే ఎందుకో? వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బీఆర్‌ఎస్ స్వాగతించడాన్ని విమర్శిస్తున్న బీజేపీ నేతలకు భారత రాజ్యాంగం, సుప్రీం కోర్టు మీద ఏమాత్రం గౌరవం లేదన్నారు. బీజేపీది నకిలీ జాతీయవాదమన్న కేటీఆర్ తమది మాత్రం ఆచరణలో, ఆత్మలో నిజమైన జాతీయవాదమని స్పష్టం చేశారు.
కులం, మతం, వర్గం చూడకుండా ప్రతి భారతీయుడినీ సమానంగా ఆదరించడమే తమ దృష్టిలో నిజమైన జాతీయవాదం అన్నారు. జాతీయవాదానికి, దురహంకార దేశభక్తికి (జింగోయిజం) మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడమే అసలైన దేశభక్తి. పహల్గాం దారుణ మారణకాండకు కారణమైన పాకిస్తాన్ తో క్రికెట్ ఆడించిన బీజేపీకి బీఆర్ఎస్ దేశభక్తి గురించి ప్రశ్నించే నైతిక అర్హత లేదు. పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిలో చిందిన 26 మంది అమాయకుల నెత్తురు తడి ఇంకా ఆరకముందే ఆ దేశంతో క్రికెట్ ఆడేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోవడం ఆ పార్టీ నకిలీ జాతీయవాదం, కపట దేశభక్తికి తిరుగులేని సాక్ష్యం. పహల్గాం బాధిత కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించినా.. ఏ మాత్రం పట్టించుకోకుండా కోట్లాది భారతీయులను మోడీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది..అని కేటీఆర్ పేర్కొన్నారు.