తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. 400 ఎకరాల భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ.. వట ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. కాగా ఇప్పటికే ఆ భూములు మావి అంటే, మావి అని అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరస్పర వాదనకు దిగాయి. భూములను వేలం వేసేందుకు చదును చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. కాగా దానిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అడ్డుకునేందుకు ఆందోళనకు దిగారు. అయితే ఈ భూముల వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై రేపు వాదనలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా కంచ గచ్చిబౌలిలోని ఆ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కాదని, గవర్నమెంట్ భూములు అని అందుకు సంబంధించి డాక్యుమెంట్స్ ప్రభుత్వం విడుదల చేసింది. టీజీఐఐసీ సైతం ఆ 400 ఎకరాల భూములు ప్రభుత్వానివని క్లారిటీ ఇచ్చింది. గతంలో జరిగిన కేటాయింపులు కేసుల వివరాలు, ఇటీవల హైకోర్టు తీర్పుతో ఆ భూములు మళ్లీ ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చినట్లు స్పష్టం చేసినా వివాదం కొనసాగుతోంది. సెంట్రల్ యూనివర్సిటీ భూములను తెలంగాణ ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అది అటవీ భూమి అని, వన్యమృగాలను అక్కడి నుంచి తరిమి కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం భూములను బలవంతంగా లాక్కుంటుందని విమర్శించారు.