మనుషులనే కాదు చెట్లనూ కాంగ్రెస్ బతకనివ్వడం లేదు..200 చెట్ల నరికివేతపై కేటీఆర్ ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

By -  Knakam Karthik
Published on : 25 Feb 2026 3:05 PM IST

Telangana, KTR, BRS, Congress Govt, Palle Prakruthi Vanam, Mahabubnagar, KCR, CM RevanthReddy

మనుషులనే కాదు చెట్లనూ కాంగ్రెస్ బతకనివ్వడం లేదు..200 చెట్ల నరికివేతపై కేటీఆర్ ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం గత రెండేళ్లుగా కాంగ్రెస్ కబంద హస్తాల్లో చిక్కుకుని విలవిలలాడుతోందని, మనుషులనే కాకుండా పచ్చని చెట్లను కూడా బతకనివ్వడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రతి పల్లె పచ్చగా ఉండాలనే లక్ష్యంతో కేసీఆర్ నిర్మించిన పల్లె ప్రకృతి వనాలపై కాంగ్రెస్ పగబట్టడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం జీనుగురాలలో పల్లె ప్రకృతి వనంలోని 200 చెట్లను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే నిర్దాక్షిణ్యంగా నరికివేయడం అత్యంత దారుణమని కేటీఆర్ ధ్వజమెత్తారు.

పదేళ్లపాటు కళకళలాడిన పల్లెలను కాంగ్రెస్ ధ్వంసం చేస్తోందని, ఇప్పటికే చెక్ డ్యామ్‌లను పేల్చివేయడం, చెరువులను ఆక్రమించడం, వ్యవసాయాన్ని కుప్పకూల్చడం వంటి చర్యలతో కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడుతోందని విమర్శించారు. చివరకు నీడనిచ్చే చెట్లను కూడా నరికేస్తున్నారని, ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. 'పల్లె కన్నీరు పెడుతుందో' అని మళ్లీ పాడుకునే దుస్థితి తెచ్చిన కాంగ్రెస్ పార్టీపై గ్రామాలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని కేటీఆర్ హెచ్చరించారు.

Next Story