సీఎం రేవంత్ రెడ్డి.. ఏక్ నాథ్ షిండేలా మారబోతున్నారా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని ‘అన్నయ్య’ అని సంబోధించారు
By Medi Samrat Published on 5 March 2024 3:30 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని ‘అన్నయ్య’ అని సంబోధించారు. దీనిపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) స్పందించింది. రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏకనాథ్ షిండేలా మారబోతున్నాడా అని ప్రశ్నించింది. “నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానిగా ఎన్నికవుతారని తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ అనుముల విశ్వసిస్తున్నారని, ‘గుజరాత్ మోడల్’ తరహాలో తెలంగాణను అభివృద్ధి చేసేందుకు నిరంతర మద్దతు కావాలని ఆయన కోరారు" అంటూ బీఆర్ఎస్ పోస్ట్ పెట్టింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ.. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసింది బీఆర్ఎస్. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై మీ స్వంత పార్టీ ముఖ్యమంత్రికి నమ్మకం లేనట్లు ఉందని భారత రాష్ట్ర సమితి విమర్శలు గుప్పించింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంపై అనుమానాలు ఉండడం వల్లే రేవంత్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు.
ఇక ఏక్ నాథ్ షిండే గురించి మాట్లాడుకుంటే.. 2022లో రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభంలో ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కీలక పాత్ర పోషించారు. షిండే కాంగ్రెస్- ఎన్‌సిపి కంటే శివసేన-బీజేపీ కూటమికి మొగ్గు చూపారు. చాలా మంది ఎమ్మెల్యేల మద్దతు పొందడంతో ఉద్ధవ్ ఠాక్రేకు సీఎం పదవికి రాజీనామా చేయడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది.