నల్గొండలో బీఆర్ఎస్ ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
నల్గొండలో భారత రాష్ట్ర సమితి (BRS) ఆధ్వర్యంలో జరగనున్న రైతు మహా ధర్నాకు తెలంగాణ హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 22 Jan 2025 5:03 PM ISTనల్గొండలో బీఆర్ఎస్ ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
నల్గొండలో భారత రాష్ట్ర సమితి (BRS) ఆధ్వర్యంలో జరగనున్న రైతు మహా ధర్నాకు తెలంగాణ హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. నల్గొండలో ఈ నెల 28వ తేదీన క్లాక్ టవర్ సెంటర్‌లో దుయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బీఆర్ఎస్ రైతు ధర్నా కార్యక్రమానికి న్యాయస్థానం అనుమతించింది. ఈ నెల 21 (మంగళవారం) జరగాల్సిన రైతు మహా ధర్నాకు జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.
బీఆర్ఎస్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం రైతు మహాధర్నాకు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది. కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న నల్గొండలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి జిల్లా నాయకులు ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ.. జిల్లాల్లో గ్రామ సభలు, సంక్రాంతి రద్దీ కారణంగా బందోబస్తు ఇవ్వలేమంటూ జిల్లా పోలీసులు నిరసన ధర్నాకు అనుమతి ఇవ్వలేదు.
పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ రైతు ధర్నా అనుమతి కోసం హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. బీఆర్ఎస్ రైతు మహా ధర్నాకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన జరిగే బీఆర్ఎస్ మహా ధర్నాకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు హాజరుకానున్నారు.