వాళ్ల ఉద్యోగాలు పోతాయనే రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం..సీఎం రేవంత్ సెటైర్

తమ ఉద్యోగాలు పోతాయనే భయంతోనే బీసీ రిజర్వేషన్లపై కిషన్ రెడ్ది, బండి సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

By Knakam Karthik  Published on  22 Feb 2025 3:57 PM IST
Telangana, CM Revanth, Caste Census, Congress, Brs, bjp, Kcr, KishanReddy, Bandi Sanjay

వాళ్ల ఉద్యోగాలు పోతాయనే రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం..సీఎం రేవంత్ సెటైర్

తమ ఉద్యోగాలు పోతాయనే భయంతోనే బీసీ రిజర్వేషన్లపై కిషన్ రెడ్ది, బండి సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాభవన్‌లో బీసీ నేతలతో సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా పాదయాత్రలో రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కులగణన చేపడుతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని తెలిపారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేసి తీరుతుందని అన్నారు. స్వాతంత్రం వచ్చాక ఇప్పటి వరకు బీసీల లెక్కలు ఎవరూ తీయలేదని గుర్తు చేశారు. రిజర్వేషన్ల విషయంలో బీసీ సంఘాలు డిమాండ్ చేయకముందే రాహుల్ హామీ ఇచ్చారని తెలిపారు. రాహుల్ గాంధీ హామీ మేరకు సీఎంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాని అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసానికి తాను పూనుకున్నట్లుగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకలజనుల సర్వే పేరుతో కేసీఆర్ కాకి లెక్కలు చెప్పారని.. ఆ సర్వేలో తప్పులు ఉన్నాయి కాబట్టే లెక్కలు అధికారికంగా బయట పెట్టలేదని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో తప్పులు ఎక్కడ తప్పులు ఉన్నాయో చూపించాలని సవాల్ విసిరారు. 150 ఇళ్లను క్లస్టర్‌గా తీసుకుని అత్యంత పకడ్బందీగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పారదర్శకంగా సర్వే చేపట్టామని తెలిపారు. గణాంకాలు మా ఇష్టపూర్వకంగా తాము రాయలేదని.. ఇంటి యజమాని స్వయంగా చెప్పిన లెక్కలే మా సర్వేలో ఉన్నాయని స్పష్టం చేశారు. కేంద్రంలో ఎంత పెద్ద నాయకుడు ఉన్నా కులగణనకు ఎవరూ ప్రయత్నం చేయలేదని తెలిపారు. సోనియాగాంధీ ఆదేశాలతో 2011లో వివరాలు సేకరించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన నివేదికను మోడీ సర్కార్ బయటపెట్టలేదని ఆరోపించారు. లెక్కలు తెలిస్తే వాటా అడుగుతారనే బయటపెట్టలేదని ఎద్దేవా చేశారు.

తమ లెక్కలను తప్పని చెప్పే వాళ్లు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చని అన్నారు. పారదర్శకంగా సర్వే చేస్తే విపక్షాలు తప్పని విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని కామెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఎందుకు వివరాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఓసీల సంఖ్యను కేసీఆర్ తన సకలజనుల సర్వేలో 21శాతంగా చూపించారని.. వాస్తవానికి తాము చేపట్టిన సమగ్ర సర్వేలో వారు 17 శాతమే ఉన్నట్లుగా తేలిందని అన్నారు. ఇక్కడే తప్పు ఎవరు చేశారో తేటతెల్లం అవుతోందని సెటైర్లు వేశారు. గుజరాత్ రాష్ట్రంలో 70 ముస్లిం కులాలను బీసీల్లో చేర్చినా.. ఎక్కడా ప్రచారం చేసుకోలేదని 2023లో మోడీ స్వయంగా చెప్పిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. కానీ, తమ ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లింలను బీసీల్లో కలిపితే బండి సంజయ్ ఎట్లా విమర్శిస్తారని ఫైర్ అయ్యారు. తప్పుడు లెక్కలంటూ.. తప్పుడు మాటలు మాట్లాడటం కాదని.. ఎట్లా తప్పో చెప్పాలని ధ్వజమెత్తారు.

కులగణన విషయంలో ఎంతో మంది రాష్ట్రానికి సీఎంలుగా పని చేసినా.. ఎవరికీ రాని అవకాశం తనకు వచ్చిందని అన్నారు. తెలంగాణ మోడల్‌ను దేశం మొత్తం అమలు చేయాలనే.. కార్యాచరణను రాహుల్ గాంధీ సిద్ధం చేసుకున్నారని కామెంట్ చేశారు. అందుకే బీజేపీ నేతలు కులగణనను తప్పుబడుతున్నారని అన్నారు. కులగణన సర్వేను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీసీలదేనని.. అంతా తానే చూసుకుంటానని అనుకోవడం సరికాదని తెలిపారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని శాస్త్రీయంగా కులగణ సర్వే నిర్వహించామని.. లెక్కలు తప్పు అని కొందరు విమర్శిస్తున్నారని.. ఎక్కడ తప్పు ఉందో బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెప్పాలని సవాల్ విసిరారు. న్యాయపరంగా ఇబ్బందులు రావొద్దనే.. రెండోసారి కులగణన సర్వేకు అవకాశం కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీజేపీక సవాల్ చేస్తున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు. జనగణనలో కులగణన చేర్చండి.. ఎవరి లెక్క తప్పో తేలుతుంది. జనగణనలో కులగణన చేర్చాలని ఈ సమావేశం వేదికగా తీర్మానం చేస్తున్నట్లు ప్రకటించారు. సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి మార్చి 10వ తేదీలోగా తీర్మానాలు చేయాలని చెప్పారు.

Next Story