రెండు రోజుల్లో భారీ కుంభకోణం బయటపెడతా.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

By Knakam Karthik
Published on : 8 April 2025 1:42 PM IST

రెండు రోజుల్లో భారీ కుంభకోణం బయటపెడతా.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండ్రోజుల్లో ఓ భారీ కుంభకోణాన్ని బయటపెడతా. 400 ఎకరాలు కాదు.. దాని వెనకాల వేల ఎకరాల వ్యవహారం ఉంది. దీనిలో కాంగ్రెస్, బీజేపీ నేతల పెద్దలు కూడా ఉన్నారు. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉంది. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే.. మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి సీఎంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ కలిసి రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారు..అని కేటీఆర్ ఆరోపించారు.

రాష్ట్రంలో నెగిటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని.. లగచర్ల, హెచ్‌సీయూ, మూసీ విషయంలో ఏఐ వీడియోలు అంటూ ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. హెచ్‌సీయూలో జంతువుల వ్యధకు కారణమైన వారిపై కేసులు పెట్టాల్సిందే అని అన్నారు. ప్రభుత్వ సంస్థ జూపార్క్ నివేదికలోనే జింకలు, నెమళ్లు ఉన్నట్లు చెప్పాయని కేటీఆర్ గుర్తుచేశారు. గంచ గచ్చిబౌలి భూముల విషయంలో కోర్టులను కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని విమర్శించారు.

25 ఏళ్లు పూర్తయిన రెండో తెలుగు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ అని.. అందుకే వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అది బీఆర్ఎస్ చరిత్రలో అతిపెద్ద బహిరంగ సభ కాబోతోందని అన్నారు. ఈసారి డిజిటల్ మెంబర్ షిప్‌ను ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కార్యాలయాల్లో శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా రాష్ట్రంలో నెలకో కార్యక్రమం నిర్వహిస్తామని కీలక ప్రకటన చేశారు. వరంగల్ బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంటామని కేటీఆర్ అన్నారు.

Next Story