ఆయన జైలుకు వెళ్లాడు కాబట్టే, మా వాళ్లనూ పంపించే ఆలోచన: కేటీఆర్
ఎన్ని కేసులు పెట్టినా..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
By Knakam Karthik
ఆయన జైలుకు వెళ్లాడు కాబట్టే, మా వాళ్లనూ పంపించే ఆలోచన: కేటీఆర్
కాళేశ్వరం కమిషన్ పేరుతో ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీ అమలు నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని ఎంత ప్రయత్నించినా మరలనియ్యం. ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం. ఎన్ని రకాలుగా వేధించినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టము. కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేదాకా వెంటాడుతూనే ఉంటాం. తెలంగాణలోని వాగులు, వంకలు, నదులు, చెరువుల మీద కేసీఆర్ కు ఉన్నంత సంపూర్ణ అవగాహన సమకాలిన రాజకీయాల్లో దేశంలో ఇంకో రాజకీయ నేతకు లేదు. ధర్మము న్యాయమే గెలుస్తుంది. నిజాలు బయటికి వస్తాయి. అల్టిమేట్‌గా తెలంగాణ సాధించిన నాయకుడిగా, తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా కేసీఆర్ పేరు సువర్ణ అక్షరాలతో చరిత్రలో లిఖించబడుతుంది..అని కేటీఆర్ అన్నారు.
రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ చిల్లర రాజకీయాలను ప్రజలు పట్టించుకోవాల్సిన పనిలేదు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల మీదనే మనమందరం దృష్టి పెడదాం. ఈ చిల్లర రాజకీయాలు ముగిసిన తర్వాత కచ్చితంగా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో బట్టలిప్పి నిలుచోబెట్టే విధంగా మా కార్యచరణ ఉంటుంది. దానికి రాష్ట్ర ప్రజలంతా మద్దతు పలకాలి. రేవంత్ రెడ్డి అనే ఒక చిల్లర నాయకుడికి క్యాబినెట్ అంటే అర్థం కాదు. కేబినేట్ ఎలా పనిచేస్తుందో తెలియదు. ఆయన ఆలోచనలు వేరు. ఆయన అజెండా వేరు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాల కంటే రేవంత్ రెడ్డికి రాజకీయ ప్రయోజనాలు, రాక్షసానందం,పైశాచిక ఆనందమే ముఖ్యమే. చిల్లర పనులు చేసి బ్యాగులు మోసి రేవంత్ రెడ్డి జైల్లో పడ్డాడు కాబట్టే మా వాళ్లను కూడా కొంతమందిని జైల్లో పెట్టాలన్నదే ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకేమీ కాదు. నిజం నిలకడ మీదనే తెలుస్తుంది. నిజం గడప దాటే లోపల అబద్ధం అంగీ లాగేసుకొని ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు కొన్ని రోజులు కాళేశ్వరం అని, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని, కొన్ని రోజులు ఫార్ములా ఈ రేసింగ్ అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలన్నీ 420 హామీలు, ఆరు గ్యారంటీల అమలు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నం..అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాను దాటిపోయేలా తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేసి భారతదేశంలోనే అగ్ర భాగాన నిలబెట్టినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా?. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రజాస్వామ్య భారతంలో నాలుగేళ్లలోనే కట్టినందుకు నోటీసులు ఇస్తారా.? ఇది కక్ష సాధింపు, రాజకీయ వేధింపు తప్ప ఇందులో ఏమీ లేదు. నిజం నిలకడ మీద తేలుతుంది. కేసీఆర్ ని వేధిస్తే ప్రజాక్షేత్రంలో ప్రజలే బుద్ధి చెబుతారు. .అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇరిగేషన్ గురించి కేసీఆర్ గారిని ప్రశ్నించడం అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయడమే!- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/aBOjQOYz9b
— BRS Party (@BRSparty) June 11, 2025