అసెంబ్లీకి కేసీఆర్ హాజరుపై..కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 10 March 2025 3:13 PM IST
అసెంబ్లీకి కేసీఆర్ హాజరుపై..కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ స్థాయి వేరు, ఆయన స్థాయికి కాంగ్రెస్ నేతలు సరిపోరు. వీళ్లు మాట్లాడే పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు వినకూడదనేది ఆయన ఆలోచన..అని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి వెనుక నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ తీసుకువచ్చేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. టీడీఆర్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయన చుట్టూ ఉన్న నలుగురు బ్రోకర్లు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వందల, వేల కోట్ల కుంభకోణానికి నలుగురు బ్రోకర్లతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు. అని కేటీఆర్ ఆరోపణలు చేశారు. వరంగల్ ఎయిర్‌పోర్టు కోసం ముందు పడి కృషి చేసింది మేము, కానీ వాళ్లు పేరు పెట్టుకుంటున్నారు.. అని కేటీఆర్ విమర్శలు చేశారు.
దాసోజు శ్రవణ్‌ను 2023లో నామినేట్ చేశాం..అప్పుడు బీజేపీ ఆపింది. అందుకే కేసీఆర్ మళ్లీ గుర్తించి అవకాశం ఇచ్చారు. రేవంత్ రెడ్డి మాటలు ఢిల్లీలో నడవడం లేదు, కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులు ఉన్నారని రాహుల్‌గాంధీ అన్నారు. అందుకే ఆయనది నడవడం లేదు. ఎక్కే విమానం దిగే విమానం తప్ప రేవంత్ రెడ్డి చేసేదేమీ లేదు. ఈ కార్ రేస్ కేసులో మళ్లీ నోటీసులు ఇస్తారు. 16న బడ్జెట్ పెట్టి, 17 నోటీసులు ఇచ్చి మళ్లీ పిలుస్తారు. ప్రతి బడ్జెట్‌లో ఇది ఉండేదే. ఇది ముమ్మాటికి లొట్టపీసు కేసు. ఈ కార్ రేసు వల్ల ఏం లాభం జరిగిందో నేను చూపిస్తా. రూ.200 కోట్లు పెట్టి ప్రపంచ సుందరి పోటీలు పెడుతున్నారు. దీని వల్ల లాభం ఏమిటి? అని కేటీఆర్ ప్రశ్నించారు.