బీజేపీ, కాంగ్రెస్ కలిసి..బీఆర్ఎస్‌పై కుట్ర చేస్తున్నాయి: ఎమ్మెల్సీ కవిత

బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్‌పై దాడి చేస్తున్నాయని.. ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.

By Knakam Karthik  Published on  27 Feb 2025 12:13 PM IST
Telangana, Hyderabad, Mlc Kavitha, Cm Revanth, Pm Modi, Brs, Bjp, Congress

బీజేపీ, కాంగ్రెస్ కలిసి..బీఆర్ఎస్‌పై కుట్ర చేస్తున్నాయి: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ రాష్ట్ర ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణం హైడ్రా..అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. హైడ్రా కారణంగా రాష్ట్ర ఆదాయం రూ.5 వేల కోట్లకు పడిపోతుందని విమర్శించారు. హైకోర్టు హెచ్చరిస్తున్నా కూల్చివేతలు మాత్రం హైడ్రా అధికారులు ఆపడం లేదని అన్నారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని కలిసి అంతులేని అబద్ధాలు మాట్లాడారు. దృష్టి పెట్టాల్సిన అనేక అంశాలు పక్కన పెట్టి కేసీఆర్‌పై ఇష్టానుసారంగా మాట్లాడారు. 2024-25 కాగ్ రిపోర్టులో రాష్ట్ర అప్పు గురించి స్పష్టంగా చెప్పారు. అయినా కూడా సీఎం రేవంత్ రూ.6500 కోట్లు వడ్డీ కడుతున్నాం అని అబద్ధాలు చెప్పారు. రాష్ట్రానికి రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం చెబుతుంటే.. రూ.12 వేల కోట్ల ఆదాయం వస్తుందని కాగ్ చెబుతుంది.. అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనలో కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విషం చిమ్ముతున్నారని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రూ.100 కోట్లు నిధుల కాంట్రాక్టు జానారెడ్డి ముందే ఇచ్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్. రూ.3300 కోట్లు అప్పటి టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఖర్చు చేస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3,900 కోట్లు ఖర్చు చేసింది. పాత రిప్రంజెటేషన్‌ను కొత్తగా ఇచ్చారు తప్ప, చేసింది, తెచ్చింది ఏమీ లేదని కవిత విమర్శించారు. ప్రధాని మోడీని రేవంత్ కలిసిన తర్వాత ఎంత నిధులు తెచ్చారు. కలిసి వచ్చిన తర్వాత బీఆర్ఎస్‌ను ఖతం చేస్తాం, లేకుండా చేస్తాం అని ప్రకటనలు చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్‌పై దాడి చేస్తున్నాయని.. ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ప్రధాని మోడీని కలిసిన తర్వాతనే రేవంత్ ఇలాంటి కామెంట్స్ చేయడం వెనుక పెద్ద ఎత్తున కుట్ర కూడా ఉందని ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు.

Next Story