అలా చేయకపోతే రైతులతో కలిసి వెళ్తాం..ప్రభుత్వానికి హరీశ్ రావు వార్నింగ్

రాజకీయాలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు..అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.

By Knakam Karthik
Published on : 6 July 2025 2:23 PM IST

Telangana, Congress Government, Cm Revanthreddy, Brs, Harishrao, Farmers

అలా చేయకపోతే రైతులతో కలిసి వెళ్తాం..ప్రభుత్వానికి హరీశ్ రావు వార్నింగ్

రాజకీయాలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు..అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, తెలంగాణలో మాత్రం వర్షాభావ పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమని అన్నారు. సాధారణంగా కృష్ణాలోని జూలై, ఆగస్టు చివరన వరదనీరు వస్తుందని.. కానీ, అనూహ్యంగా మే నెలలోనే కృష్ణాకు వరద నీరు రావడంతో రెండు పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఎక్కడికక్కడ మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు, చెరువు, చెక్‌డ్యాంలు, చెరువులు, కుంటలు నింపుకునేందుకు చక్కని అవకాశం ఉందని అన్నారు. కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వమేమో స్విచ్ఛాఫ్ మోడ్‌లో ఉందని కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి అయినా.. మంత్రులైనా బీఆర్ఎస్ మీద నిత్యం బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని.. నిందలు వేయడంలో బిజీగా ఉన్నారని సెటైర్లు వేశారు. వదర నీటిని ఎత్తిపోసుకునేందుకు ఎవరికీ కనీస శ్రద్ధ, పట్టింపు లేదని హరీశ్ ధ్వజమెత్తారు.

కరువును పారదోలే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ మీద కక్ష, కడుపు మంటతో వద్దనుకుంటోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉంటే.. తమ మీద పగ తీర్చుకోవాలని, రాష్ట్రంలోని రైతులు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. నీళ్ల విలువ తెలిసినోళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే.. ఆ నీళ్లను మలుపుకునే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునే వారని అన్నారు, రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వదర నీరు వచ్చి నెల దాటిందని.. కానీ, ఇప్పటికీ మోటార్లు ఆన్ చేయకపోవడానికి కారణం ఏంటో చెప్పాలన్నారు. కళ్ల ముందు నీళ్లు పోతున్నా.. పట్టించుకోకపోవడాన్ని నేరపూరిత నిర్లక్ష్యమేనని ఫైర్ అయ్యారు. ఆ నీటితో 15 జిల్లాల్లోని లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉందని అన్నారు. ఇక ఆలస్యం చేస్తే ఊరుకోబోమని. లక్షలాది మంది రైతులతో కన్నేపల్లికి కదిలి మోటార్లు ఆన్ చేస్తామని హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు.

Next Story