ప్రమాదం జరిగి 50 రోజులవుతున్నా పురోగతి లేదు? SLBC సహాయక చర్యలపై హరీష్‌రావు ఆవేదన

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్‌ రెడ్డిపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.

By Knakam Karthik
Published on : 13 April 2025 9:46 AM IST

Telangana, HarishRao, Brs, Congress Government, Cm Revanthreddy, Slbc Tunnel

ప్రమాదం జరిగి 50 రోజులవుతున్నా పురోగతి లేదు? SLBC సహాయక చర్యలపై హరీష్‌రావు ఆవేదన

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్‌ రెడ్డిపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. ఈ మేరకు ఇలా రాసుకొచ్చారు.. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు 50 రోజులు పూర్తి. అయినా ప్రభుత్వ సహాయక చర్యల్లో పురోగతి లేదు. ఇది అత్యంత బాధాకరమైన సందర్భం. తమ వారు ప్రాణాలతో తిరిగి వస్తారన్న ఆశలు పెట్టుకుని టన్నెల్ వద్దనే ఉండి రోదిస్తున్న కుటుంబ సభ్యుల ఆవేదన అరణ్య వేదన అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఎనిమిది మంది అమాయకుల ప్రాణాలను ప్రశ్నార్థకం చేసింది. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. టన్నెల్‌లో చిక్కుకున్న వారిని కాపాడడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇద్దరి మృతదేహాలను వెలికితీసి చేతులు దులుపుకుంది..అని హరీష్ రావు విమర్శించారు.

ఇంత పెద్ద ప్రమాదం జరిగి, యావత్ దేశం వారిని క్షేమంగా బయటికి తీసుకొస్తారని ఆశగా ఎదురుచూస్తే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు. టన్నెల్‌లో పనులు నిర్వహించే సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం, ప్రమాదం జరిగిన వెంటనే తగిన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలం. పబ్లిసిటీ కోసం టన్నెల్ వద్దకు వెళ్ళి రావడం తప్ప ఇప్పటి వరకు చేసిందేం లేదు. ఒకసారి సమీక్ష చేయడం తప్ప చిత్తశుద్ధితో పరిష్కార మార్గం కోసం ప్రయత్నించింది లేదు. హెలికాప్టర్ లో వెళ్ళి మంత్రులు పెట్టిన డేట్లు మారాయి తప్ప, ఇప్పటి వరకు ఒక్కరిని ప్రాణాలతో బయటకు తెచ్చింది లేదు. సహాయక బృందాలను సమన్వయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర ఆలస్యం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చరిత్రలో నిలిచిపోయే అప్రతిష్ఠ సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పి ఇంకెన్ని రోజులు కాలయాపన చేస్తారు? లోపల చిక్కుకున్న ఆరుగురి పరిస్థితి ఏమిటి? కూటి కోసం, కూలీ కోసం తెలంగాణకు వచ్చి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు అండగా నిలవాలి. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటన పట్ల పూర్తి స్థాయి విచారణ జరపాలని, వాస్తవాలను బయటపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

Next Story