బీజేపీకి 200 సీట్లు దాటవు : కేసీఆర్
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు దాటవని.. ప్రాంతీయ పార్టీలే ప్రధాన పాత్ర పోషిస్తాయని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు.
By Medi Samrat Published on 7 May 2024 8:09 AM ISTలోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు దాటవని.. ప్రాంతీయ పార్టీలే ప్రధాన పాత్ర పోషిస్తాయని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తనకు ప్రతిరోజూ అందుతున్న సమాచారం కాషాయ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని సూచిస్తోందని అన్నారు. “బీజేపీకి 200 సీట్లు దాటవు. ఇక్కడ నేను మీకు చెబుతున్నాను, ప్రాంతీయ పార్టీలు ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి.. 100 శాతం, అది జరగబోతోందని కేసీఆర్ ఘంటాపథంగా చెప్పారు.
బీజేపీ చేస్తున్న ‘400 పార్’ నినాదం చెత్త అని.. 200 సీట్లు దాటడం కూడా కష్టమని కేసీఆర్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఐదు-10 సీట్లు కూడా రావని చెప్పారు. మొదటి రెండు దశల్లో బీజేపీ 200 సీట్లు వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. బీజేపీ గోబెల్స్ కంటే ఎక్కువ ప్రచారం చేస్తుందని అన్నారు. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 64 అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిందని చెప్పారు.
హంగ్ తీర్పు వస్తే బీఆర్‌ఎస్ ఎవరికి మద్దతిస్తుందని ప్రశ్నించగా.. ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలకు బీజేపీ లేదా కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని అన్నారు. ఒక నాయకుడిని ప్రధానిగా ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత గురించి ప్రస్తావించినప్పుడు.. అనుభవజ్ఞుడైన, మంచి నాయకుడిని ప్రధానికి ఎంపిక చేయవచ్చని అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్రంలో కాంగ్రెస్, బీజేపీలు ఏం సాధించాయని ప్రశ్నించారు.