తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో నోటీసులు అందుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాసేపట్లో సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన ఖైరతాబాద్‌లోని హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని సిట్ కోరింది. నా దగ్గరున్న సమాచారాన్ని సిట్‌కు అందజేస్తా. బాధ్యతల గల పౌరుడిగా విచారణకు వెళ్తున్నా. సిట్ విచారణపై నమ్మకం లేదు..అని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనే విషయాన్ని మొట్టమొదట బయటపెట్టింది నేనే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రతిక్షణ నా ఫోన్ ట్యాప్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే, నన్ను దెబ్బతీయాలని అనేక కుట్రలు చేశారు..అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.