ఆయన రబ్బర్ స్టాంప్ సీఎం..ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?: బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంప్ లా మారారని మండిపడ్డారు.
By Knakam Karthik
ఆయన రబ్బర్ స్టాంప్ సీఎం..ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?: బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంప్ లా మారారని మండిపడ్డారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బండి సంజయ్ మొదట తన నివాసంలో, ఆ తరువాత కరీంనగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ.. సచివాలయం నుండి ఏఐసీసీ ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీతో రివ్యూ చేయడమేందని ప్రశ్నించారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో ఏఐసీసీ అధిష్టానానిదే తుది నిర్ణయమని పీసీసీ అధ్యక్షులు చెప్పడం సిగ్గు చేటన్నారు. ‘‘రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరుండాలి? ఎవరు వద్దు? ఎవరికి చోటు కల్పించాలనేది ముఖ్యమంత్రి విచక్షణాధికారం. కానీ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించడమేంది? సచివాలయంలో కాంగ్రెస్ నేత రివ్యూ చేయడమేంది? తెలంగాణలో పాలన భ్రష్టు పట్టిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?’’ మండిపడ్డారు.
దేశ ప్రజలకు, కార్యకర్తలందరికీ బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 45 ఏళ్లుగా బీజేపీ అనేక ఒడిదొడుకులు, అవమానాలను అధిగమించిన పార్టీ బీజేపీ. వేలాది మంది కార్యకర్తల బలిదానాలు, లక్షలాది మంది పోరాటాలతో అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ. జాతీయ భావజాలం, సిద్ధాంత బలమే బీజేపీ ఈ స్థాయికి చేరింది. 2019లోనే బీజేపీ 18 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే నెంబర్ వన్ పార్టీగా అవతరించింది. 16 రాష్ట్రాల్లో సొంతంగా, 6 రాష్ట్రాల్లో కూటమి ద్వారా ప్రభుత్వాలను కొనసాగిస్తున్నాం..అని బండి సంజయ్ పేర్కొన్నారు.
రేషన్ షాపుల వద్ద ప్రజలకు ఇచ్చేది మోదీ బియ్యమే. కిలోకు రూ.37 లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం మోడీదే. సన్న బియ్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భరించేది రూ.10 మాత్రమే. అట్లాంటప్పుడు రేషన్ షాపుల వద్ద ప్రధాని ఫోటో ఎందుకు పెట్టకూడదు?. రూ.10లకు కిలో సన్నబియ్యం ఎక్కడైనా వస్తాయా?. ఆ విషయాన్ని తెలుసుకుని మంత్రులు, కాంగ్రెస్ నేతలు మాట్లాడితే మంచిది. బీజేపీ కార్యకర్తలారా....గ్రామగ్రామాన తిరిగి ప్రజలకు రేషన్ బియ్యంపై వాస్తవాలు వివరించండి. వడ్ల కొనుగోలు నుండి బియ్యం దాకా ప్రతిపైసా కేంద్రమే చెల్లిస్తోంది. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి నిధులన్నీ ఎవరు చెల్లిస్తున్నారో చెప్పాలి..అని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పాలన భ్రష్టు పట్టింది. 6 గ్యారంటీలకు దిక్కులేకుండా పోయింది. ముఖ్యమంత్రి రబ్బర్ స్టాంప్ లా మారారు. జన్ పథ్, గాంధీభవన్ ద్వారా పాలనను కొనసాగిస్తున్నారు. మంత్రివర్గంలో ఎవరుండాలనేది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందనడం విడ్డూరం. మంత్రివర్గ విస్తరణ సీఎం విచక్షణాధికారం. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని పీసీసీ అధ్యక్షులు చెప్పడం సిగ్గు చేటు. తెలంగాణను దోచుకుని ఢిల్లీ పెద్దలకు కప్పం కడుతున్నారు. పాలనపై సీఎంకు పట్టులేకుండా పోయింది.హెచ్ సీయూ భూముల వ్యవహారమే ఇందుకు కారణం. కాంగ్రెస్ అవినీతి పాలనను అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది..అని బండి సంజయ్ పేర్కొన్నారు.
Live : Addressing the Media in Karimnagar https://t.co/S8pMxThg2c
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) April 6, 2025