టాలీవుడ్ సీనియర్ నటి దివ్యవాణి గురువారం శామీర్‌పేటలోని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాసంలో సమావేశమయ్యారు. ఆమె తెలంగాణ బీజేపీలో చేరేందుకు ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పిన దివ్యవాణి.... ఈటలతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఓ వీడియోలో.. నటి దివ్యవాణి బీజేపీ జాయినింగ్ కమిటీకి నాయకత్వం వహిస్తున్న ఈటాలతో సంభాషించడం కనిపిస్తుంది. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు దివ్యవాణి టీడీపీలో చేరి అధికార ప్రతినిధిగా పనిచేశారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనల్లో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. అయితే, 2022 మేలో జరిగిన మహానాడులో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో టీడీపీ అగ్రనాయకత్వంపై ఆమె అసంతృప్తి వెళ్లగక్కారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడును కలవడానికి అనుమతించకపోవడంతో టీడీపీ నేతలపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేసి టీడీపీకి రాజీనామా చేశారు. గత రెండు నెలలుగా ఆమె మీడియాకు దూరంగా ఉంటున్నారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, గతంలో టీడీపీతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలకంగా ఉన్నప్పుడు దివ్యవాణి తెలంగాణ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈటలను కలవడంతో బీజేపీలో చేరిక ఖాయం అనే వార్తలు వస్తున్న క్రమంలో దివ్యవాణి స్పందించారు. బీజేపీలో చేరే అంశాన్ని తొందరలోనే ప్రకటిస్తానని దివ్యవాణి తెలిపారు. ఇప్పటికే పలుమార్లు బీజేపీ నేతలు తనను సంప్రదించారని.. ఇవాళ ఈటల రాజేందర్‌తో సమావేశం అయ్యానని ఆమె తెలిపారు. పార్టీ లో చేరికపై చర్ఛజరిగిందని చెప్పారు.