అంత‌ర్వేదిలో కొన‌సాగుతున్న ఉద్రిక్త‌త‌.. గృహా నిర్భందంలో బీజేపీ, జనసేన నేతలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Sept 2020 12:36 PM IST
అంత‌ర్వేదిలో కొన‌సాగుతున్న ఉద్రిక్త‌త‌.. గృహా నిర్భందంలో బీజేపీ, జనసేన నేతలు

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధం ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. దీనిపై ఇప్పటికే పలు హిందూ సంస్థలు మండిపడుతున్నాయి. ఇంకా అక్కడ ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఛలో అంతర్వేదికి భాజపా, జనసేన పిలుపునిచ్చాయి. దీంతో కోనసీమ వ్యాప్తంగా భాజాపా, జనసేన నేతలను పోలీసులు గృహనిర్భందంలో ఉంచారు.

కొత్తపేటలో బీజేపీ నేత‌ పాలూరు సత్యానందం, రావులపాలెంలో రామకృష్ణారెడ్డిలను గృహనిర్బంధం చేశారు. అలాగే, నిన్న చలో అంతర్వేదిలో పాల్గొన్న 43 మంది నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అంతర్వేదిలో పోలీసులు భారీగా మోహరించారు. ఇతర ప్రాంతాల వారిని అక్క‌డ‌కు రానివ్వ‌ట్లేదు. 30వ‌ పోలీసు యాక్టు అమలు కారణంగా అక్క‌డ‌ పర్యటించేందుకు నాయకులకు అనుమతి లేదని తెలిపారు. కాగా, నిన్న ప‌లువురు మంత్రులు ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించేందుకు వెళ్ల‌గా హిందూ సంఘాల కార్య‌క‌ర్త‌లు వారిని అడ్డుకోవ‌డంతో వారు అక్క‌డి నుంచి వెనుదిరిగిన విష‌యం తెలిసిందే. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం రథం త‌గ‌ల‌బ‌డిన ఘ‌ట‌న వెనుక ప‌లువురి హ‌స్తం ఉంద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తుండ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి.

మరోవైపు అంతర్వేది రథం దగ్ధం ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహన్‌రావు తెలిపారు. అంతర్వేది ఆలయంలో ఫోరెన్సిక్‌ ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అంతర్వేది ఆలయ పరిసరాల్లో పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉందని, బయటి ప్రాంతాల వారు ఇక్కడికి రావడంపై నిషేధాజ్ఞలు ఉన్నాయని స్పష్టం చేశారు. అందరూ సంయమనం పాటించాలని ఆయన కోరారు.

సెప్టెంబర్ 5 అర్ధరాత్రి తర్వాత అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రథం మంటల్లో కాలిపోయింది. సుదీర్ఘకాలంగా ఏటా కల్యాణోత్సవాల సందర్భంగా రథోత్సవం నిర్వహిస్తారు. ఆ సందర్భంగా ఈ రథాన్ని వినియోగించేవారు. అంతర్వేది రథోత్సవం అత్యంత ఉత్సాహంగా సాగేది. భక్తులు పవిత్రంగా భావించే ఈ రథం మంటల్లో కాలిపోవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సఖినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు.

Next Story