సీతానగరం శిరోముండనం కేసు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Sep 2020 5:54 AM GMT
సీతానగరం శిరోముండనం కేసు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా శిరోముండనం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు నమోదు తరువాత తదుపరి చర్యలు నివారించాలని నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు నిందితులపై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం విచారణను అక్టోబర్‌ 5కి వాయిదా వేసింది. దీంతో వైసీపీ నాయకులకు ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలంటూ బాధితుడు వరప్రసాద్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఓట్రైనీ ఎస్‌ఐతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్టయ్యారు.

వైసీపీ నేత, అతని అనుచరులు శిరోముండనం చేయించేలా పోలీసులను ప్రోత్సహించారని బాధితుడు ప్రసాద్ ఆరోపించారు. ఇక ఈ కేసుపై బాధితుడి ఫిర్యాదు మేరకు రాష్ట్రపతి కార్యాలయం కూడా స్పందించింది. ఈ కేసును తక్షణం విచారించేలా ఫైలును సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో ప్రసాద్ చెప్పేవన్నీ అబద్దాలని ప్రమాదంలో కాళ్లు విరిగి గాయపడ్డ విజయ్ బాబు వెల్లడించిన విషయం తెలిసిందే.

Next Story