సీఎం సొంత జిల్లాలో రోడ్డెక్కిన మహిళలు.. ఎందుకంటే?

By సుభాష్  Published on  9 Sep 2020 5:38 AM GMT
సీఎం సొంత జిల్లాలో రోడ్డెక్కిన మహిళలు.. ఎందుకంటే?

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జిల్లాలో గండికోట ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధిత మహిళలు రోడ్లెక్కారు. తమకు ఇవ్వాల్సిన పరిహారాన్ని ఇవ్వకుండా.. తమను బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తున్న వైనాన్ని ప్రభుత్వం చూపు పడేలా చేశారు.

గాలేరు - నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా 26.8 టీఎంసీల సామర్థ్యంతో గండికోట జలాశయాన్ని నిర్మించారు. ఇందులో భాగంగా ముంపునకు గురైన పద్నాలుగు గ్రామాల్ని ఇప్పటికే ఖాళీ చేయించారు. అయినప్పటికి పన్నెండు టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేయలేని పరిస్థితి.

దీంతో.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిని నిల్వ ఉంచాలంటే పలు గ్రామాల్ని ఖాళీ చేయించాల్సి ఉంటుంది. కొండాపురం.. తాళ్లప్రొద్దుటూరు.. ఎర్రగుడి.. చామలూరు.. పి.అనంతపురం.. ఏటూరు.. రేగడిపల్లి.. కె.సుగుమంచిపల్లి గ్రామాలకు చెందిన దాదాపు 8700 ఇళ్లను ఖాళీ చేయించాల్సి ఉంటుంది. పరిహారంలో భాగంగా ప్రభుత్వం రూ.669 కోట్లు విడుదల చేసినా.. వాటిని బాధితులకు చేర్చలేదు. ఇదిలా ఉంటే.. కరోనా కాలంలో తాము ఇళ్లు వదిలి ఉన్నపళంగా ఎక్కడకు వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు.

అయినప్పటికీ పట్టించుకోని అధికారులు తమ లక్ష్యంగా మారిన ఇళ్లను ఖాళీ చేయించేందుకు వీలుగా ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయా గ్రామాల మహిళలు.. రోడ్ల మీదకు వచ్చి శాంతియుత ఆందోళనకు తెర తీశారు. కేసులు పడతాయన్న భయంతో పురుషులు ఇళ్లలోనుంచి బయటకు రాకపోవటంతో.. మహిళలే ముందుకు వచ్చి నిరసన చేపట్టటం ద్వారా తమ గోడు ప్రభుత్వానికి తెలిసేలా చేశారు. సొంత జిల్లాకు చెందిన మహిళలు రోడెక్కిన వేళ.. సీఎం జగన్ ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Next Story