పెర్త్ టెస్టుకు ముందు శుభ‌వార్త‌.. మూడోరోజే జ‌ట్టుతో చేర‌నున్న‌ రోహిత్..!

నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.

By Medi Samrat  Published on  21 Nov 2024 6:48 PM IST
పెర్త్ టెస్టుకు ముందు శుభ‌వార్త‌.. మూడోరోజే జ‌ట్టుతో చేర‌నున్న‌ రోహిత్..!

నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ గురించి పెద్ద సమాచారం వెలుగులోకి వచ్చింది. రోహిత్‌ నవంబర్ 24 (ఆదివారం)న భారత జట్టుతో చేరుతాడు. అంటే అతడు మ్యాచ్ మూడవ రోజు పెర్త్‌లో కనిపిస్తాడు. ఈ మేరకు వార్తా సంస్థ పీటీఐ గురువారం వెల్లడించింది. హిట్‌మాన్‌కు రెండవ బిడ్డ పుట్టిన కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు జట్టుతో పాటు వెళ్లలేదు. నవంబర్ 15న అతని భార్య రితిక రెండో బిడ్డకు జన్మనిచ్చింది.

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ శుక్రవారం నుంచి పెర్త్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడడం లేదు. ఈ మ్యాచ్‌ మూడో రోజుకు జట్టుతో చేరనున్నాడు కాబట్టి.. ఈ రోహిత్‌ రెండవ టెస్టులో ఆడుతాడు. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టు మూడో రోజు రోహిత్ పెర్త్ చేరుకుంటాడని బీసీసీఐ వర్గాలు పీటీఐకి తెలిపాయి.

రోహిత్ శర్మ గైర్హాజరీతో భారత జట్టుకు జస్ప్రీత్ బుమ్రా బాధ్యతలు చేపట్టనున్నాడు. గురువారం విలేకరుల సమావేశంలో కెప్టెన్సీ గురించి బుమ్రా మాట్లాడుతూ.. జట్టును నడిపించడం గురించి కోచ్, టీమ్ మేనేజ్‌మెంట్ ఇప్పటికే తనకు తెలియజేశారని చెప్పాడు. అంతే కాకుండా రోహిత్‌తో ఈ విషయంపై ఇప్పటికే మాట్లాడినట్లు తెలిపారు.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) దృష్ట్యా ఈ సిరీస్ భారత్‌కు చాలా ముఖ్యమైనది. ఫైనల్స్‌కు చేరుకోవాలంటే నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి ఒక టెస్టును డ్రా చేసుకోవాలి. ఇటీవల న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో 0-3 తేడాతో భారత జట్టు ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో సిరీస్ గురించి బుమ్రాను అడగ‌గా.. న్యూజిలాండ్‌తో సిరీస్ నుండి మనం నేర్చుకోవాలి.. మేము ఆ భారాన్ని మోయలేము. ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. మీరు వేరే ఫలితాన్ని ఆశించవచ్చని వ్యాఖ్యానించాడు.

Next Story