ఐపీఎల్ హ్యాంగోవర్ నుంచి బయటపడేందుకు టీమిండియా ప్రత్యేక వ్యూహం..!
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య బుధవారం నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది.
By Medi Samrat
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య బుధవారం నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం భారత జట్టు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ముఖ్యంగా బౌలర్లు చెమటలు చిందిస్తున్నారు. లీడ్స్‌లో బౌలర్ల పేలవ ప్రదర్శన నేపథ్యంలో.. ఐపీఎల్ హ్యాంగోవర్ నుండి బయటపడేందుకు భారత జట్టు మేనేజ్‌మెంట్ బౌలర్లచే రెండు రంగుల బంతులతో ప్రాక్టీస్ చేయిస్తోంది. ఈ బంతికి ఒకవైపు తెల్లగానూ, మరోవైపు ఎరుపు రంగులోనూ ఉంటుంది. భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెస్కాట్ విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇంగ్లండ్‌తో జరిగే రెండో టెస్టుకు ముందు.. భారత ఫాస్ట్ బౌలర్లు IPL లైన్-లెంగ్త్ నుండి బయటపడేందుకు రెండు రంగుల బంతులతో ప్రాక్టీస్ చేశారు. సెషన్ ప్రారంభంలో.. జస్ప్రీత్ బుమ్రా సగం తెలుపు, సగం ఎరుపు బంతితో బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత ఇతర బౌలర్లు కూడా రెండు రంగుల బంతులతో బౌలింగ్ చేశారు. కాగా, భారత ఫాస్ట్ బౌలర్లు ఇంగ్లండ్ టూర్ ప్రారంభం నుంచే ప్రాక్టీస్ సెషన్‌లో రెండు రంగుల బంతులను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది.
సుదీర్ఘ వైట్ బాల్ సీజన్ (ఛాంపియన్స్ ట్రోఫీ మరియు IPL) తర్వాత భారత ఫాస్ట్ బౌలర్లు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లారు. రెండు రంగుల బంతులతో ప్రాక్టీస్ చేయడం వల్ల రెడ్ బాల్(టెస్ట్ మ్యాచ్‌లు) వర్సెస్ వైట్ బాల్(పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు)తో ఆడే అలవాటును వేరు చేయవచ్చని భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెస్కాట్ అన్నారు.
ఆయన మాట్లాడుతూ, 'ఇది కొత్త విషయం కాదు. అన్ని బంతి తయారీదారులు అలాంటి బంతులను తయారు చేస్తారు. పరిమిత ఓవర్లలో బౌలర్ల లైన్ లెంగ్త్ అలవాటును మెరుగుపరచాలనుకుంటున్నాం. ఇది బౌలర్లకు సూచన చేయడానికి సులభమైన మార్గం. సుదీర్ఘ ఐపీఎల్ సీజన్ తర్వాత మన ఆటగాళ్లు ఇక్కడికి వచ్చారు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ పర్యవేక్షణలో బౌలర్లు గత రెండు వారాలుగా ఈ పద్దతిని ఉపయోగిస్తున్నారని వివరించాడు.