పాట‌ల ప‌ల్ల‌కి మోసిన‌ బోయీ ఇక‌లేరు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Sept 2020 1:47 PM IST
పాట‌ల ప‌ల్ల‌కి మోసిన‌ బోయీ ఇక‌లేరు

బాలసుబ్రహ్మణ్యం సినీ అభిమానుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి అయిన‌ ఆయ‌న‌.. నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. గాయ‌కుడిగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడిన ఆయ‌న‌ సినీ వినీలాకాశంలో మ‌కుటం లేని మ‌హా‌రాజు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. ఆయ‌న కొద్దిసేప‌టి క్రితం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయ‌న గురించి మ‌న‌కు తెలియ‌ని కొన్ని విష‌యాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..

బాలు నెల్లూరు జిల్లాలో 1946, జూన్ 4న కోనేటమ్మపేట గ్రామంలో సాంబమూర్తి, శకుంతలమ్మ దంప‌తుల‌కు జన్మించాడు. తండ్రి సాంబమూర్తి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ పాల్గొంటూ బహుమతులు సాధించాడు. అయితే.. బాలు చదువుకునే రోజుల్లోనూ, ఆ తర్వాత పాటలు పాడే రోజుల్లో కొన్నేళ్ళు మంచి ఇంజనీర్ కావాలని.. ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరుగా పనిచేయాలని కలలు కనేవారు.

బాలుకు సావిత్రితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పల్లవి, ఎస్పీ చరణ్. త‌న‌యుడు చరణ్ కూడా గాయ‌కుడే. బాలు సోదరి ఎస్పీ శైలజ కూడా సినీ నేపథ్య గాయని. ఈమె సోదరునితో కలిసి పలు చిత్రాల్లో పాటలు పాడారు.

ఇక 1966 సంవ‌త్స‌రంలో పద్మనాభం నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా బాలు ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు. ఇక‌ 40 ఏళ్ళ బాల‌సుబ్ర‌మ‌ణ్యం సినీప్రస్థానంలో 11 భాషలలో 40 వేల పాటలు పాడారు. అలాగే 40 సినిమాలకు సంగీత దర్శకత్వం కూడా వ‌హించారు.

1969లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన బాలు తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించాడు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించాడు. ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌లో నటించి న‌టుడిగా కూడా అభిమానుల హృద‌యాల‌లో చిస్మ‌ర‌ణీయ‌మైన స్థానం సంపాదించుకున్నారు.

బాలు గాయ‌కుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశారు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి మేటి న‌టుల‌కు బాలు గాత్రదానం చేసారు. ఇక‌ త‌మిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నింటికి బాలునే డబ్బింగ్ చెప్పెవారు. ముఖ్యంగా 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది.

ఇవేకాక బాలు ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే పాడుతా తీయగా కార్యక్రమానికి జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించారు. తెలుగునాట విశేష ఆధ‌ర‌ణ పొందిన ఈ కార్య‌క్ర‌మం ద్వారా ఇండ‌స్ట్రీకి ఎంతోమంది నూతన గాయనీ గాయకులు ప‌రిచ‌యం అయ్యారు. 1996లో మొదలైన ఈ కార్యక్రమం ఇప్ప‌టికీ అప్ర‌తిహ‌తంగా కొనసాగుతూనే ఉంది. అలాగే ఈటీవీలో ప్రసారమయ్యే స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో కూడా బాలు తన గానాన్ని వినిపించారు.

బాలు ప్ర‌తిభ‌కు గుర్తింపుగా ఆయ‌న‌ను ఎన్నో అవార్డులు వ‌రించాయి. బాలు విశేష సేవ‌ల‌కు గుర్తింపుగా భార‌త‌ ప్రభుత్వం నుండి 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 29 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నారు. ఇవేకాక‌ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. 2012లో ఆయన నటించిన మిథునం సినిమాకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది.

ఇదిలావుంటే.. బాలు 2020 ఆగస్టు 5న‌ కోవిడ్-19 వ్యాధి సోకగా ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజుల చికిత్స అనంత‌రం ఆయ‌న కొవిడ్ నుండి కోలుకున్నారు. అయితే ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌లు తిర‌గ‌బెట్ట‌డంతో మ‌ర‌లా బాలు ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించింది. సుమారు 50 రోజులు ఆసుప‌త్రిలో మృత్యువుతో పోరాడి ఓడిన ఆయ‌న జీవితం నిజంగా దేశ యువ‌త‌కు ఆద‌ర్శం.

Next Story