అత్యంత విషమంగా బాలు ఆరోగ్యం.. ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకుంటున్న అభిమానులు

By సుభాష్  Published on  25 Sep 2020 7:07 AM GMT
అత్యంత విషమంగా బాలు ఆరోగ్యం.. ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకుంటున్న అభిమానులు

ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని గురువారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఎస్పీ బాలు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారు. అయితే బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ప్రముఖులు, అభిమానులు భారీ ఎత్తున ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుంటున్నారు.

కాగా, కరోనా సోకి స్వల్ప లక్షణాలతో బాలు ఆగస్టు 5వ తేదీన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న బాలు.. క్రమ క్రమంగా ఆరోగ్యం మెరుగు పడుతోందని ఆస్పత్రి వైద్యులు, బాలు కుమారుడు చరణ్‌ తెలిపారు. కొద్దిసేపట్లో బాలు ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా బాలు ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం ఎక్మో, వెంటిలేటర్ల ద్వారా చికిత్స అందిస్తున్నారు. కాగా, బాలు ఆరోగ్యం అత్యంత క్రిటికల్ ఉండటంతో ఆస్పత్రి వద్దకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, బాలు ఆత్మీయుడు, ప్రముఖ దర్శకుడు భారతీ రాజా చేరుకున్నారు. ఇక ప్రముఖులు, అభిమానులు భారీగా చేరుకుంటుండటంతో భారీగా పోలీసులు మోహరించారు.

Next Story