ఐసీసీని బాగుచేయడం గంగూలీ వల్లే సాధ్యం : పెరుగుతున్న మద్దతు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Jun 2020 7:00 PM IST
ఐసీసీని బాగుచేయడం గంగూలీ వల్లే సాధ్యం : పెరుగుతున్న మద్దతు

సౌరవ్ గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ గా బాధ్యతలను స్వీకరించి ఎన్నో మార్పులను తీసుకుని వచ్చారు. ముఖ్యంగా యంగ్ క్రికెటర్ల విషయంలో.. ట్యాలెంట్ ఎక్కడ ఉన్నా కూడా బయటకు తీసుకుని రావాలనే ఉద్దేశ్యంతో ఎన్నో పనులను చేపట్టాడు. సరైన ఆదాయం లేకుండా ఉన్నటువంటి మాజీ క్రికెటర్లకు అండగా ఉండేలా చర్యలు తీసుకున్నాడు. ఇప్పుడు ఐసీసీని బాగుచేయడం కూడా సౌరవ్ గంగూలీ వల్లనే సాధ్యమవుతుందని ఎంతో మంది చెబుతున్నారు.

పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఏఎన్ఐ తో మాట్లాడుతూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కు నాయకత్వం వహించే అర్హత సౌరవ్ గంగూలీకి ఉందని అన్నాడు. సౌరవ్ గంగూలీ ఐసీసీ ఛైర్మన్ పదవికి పోటీ చేయాలని అనుకుంటే చాలా దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు మద్దతు ఇస్తాయని చెప్పాడు కనేరియా. ఐసీసీ ఛైర్మన్ గా పగ్గాలు చేపట్టే అన్ని అర్హతలు గంగూలీకి ఉన్నాయని.. ఒక గొప్ప ఆటగాడైన ఆయనకు క్రికెట్ గురించి బాగా తెలియడమే కాకుండా ఐసీసీలో ఉన్న లోటుపాట్లు కూడా బాగా తెలుసునని.. ఖచ్చితంగా గంగూలీ మార్పు తీసుకుని రాగలడని కనేరియా తెలిపాడు.

క్యాబ్, బీసీసీఐ బాధ్యతలు స్వీకరించి మంచి పనులు చేసిన వ్యక్తి గంగూలీ అని.. ఐసీసీ పెద్దగా ఒక మాజీ క్రికెటర్ ఉంటే ఆటగాళ్లకు కూడా ఆనందమేనని కనేరియా అభిప్రాయపడ్డాడు. గంగూలీకి ఎన్ని దేశాల క్రికెట్ బోర్డులు అండగా ఉంటాయో తెలియాలని.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గంగూలీకి మద్దతు తెలుపకపోయినా.. మిగిలిన దేశాల క్రికెట్ బోర్డుల మద్దతుతో గంగూలీకి ఐసీసీని నడిపే అధికారం వస్తుందని అన్నాడు. తనకు తెలిసినంత వరకూ చాలా దేశాల క్రికెట్ బోర్డులు గంగూలీకి మద్దతు ఇస్తాయని అన్నాడు.

బీసీసీఐ ప్రెసిడెంట్ గా గత ఏడాది గంగూలీ బాధ్యతలు స్వీకరించాడు. తాజాగా ఐసీసీ చైర్మన్ కు గంగూలీ పేరును సిఫారసు చేస్తున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. క్రికెట్ సౌత్ ఆఫ్రికా డైరెక్టర్ అయిన గ్రేమ్ స్మిత్ మే నెలలోనే గంగూలీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశాడు. గంగూలీ లాంటి వ్యక్తి ఐసీసీకి నాయకత్వం వహిస్తే తప్పకుండా క్రికెట్ కు మంచి జరుగుతుందని అన్నాడు.

ఐసీసీకి జులై నెలలో ఎలక్షన్స్ జరగనున్నాయి. ప్రస్తుతం ఛైర్ పర్సన్ గా ఉన్న శశాంక్ మనోహర్ తన పదవీ కాలం పొడిగించుకోవాలని అనుకోవడం లేదు. దీంతో కొత్త వాళ్లు ఆ సీటులో కూర్చోవాల్సి ఉంది. ఆ వ్యక్తి గంగూలీనే కావాలని చాలామంది మద్దతు తెలియజేస్తూ ఉన్నారు.

Next Story