సచిన్ నాటౌట్.. అంపైర్‌కు, నాకు బెదిరింపులు వస్తూనే ఉండేవి.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Jun 2020 10:47 AM GMT
సచిన్ నాటౌట్.. అంపైర్‌కు, నాకు బెదిరింపులు వస్తూనే ఉండేవి.!

క్రికెట్ లో సచిన్ ను దేవుడు అని అంటూ ఉంటారు. ఎందుకంటే సచిన్ క్రికెట్ కు తీసుకుని వచ్చిన వన్నె అలాంటిది. సచిన్ ఆడుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు.. ఎన్నో రికార్డులు ఆయన సొంతం. ఇక అంపైర్ల తప్పుడు డెసిషన్ల వలన సచిన్ ఎన్నో సెంచరీలు మిస్ అయ్యాడు. ఎంతో రికార్డులకు కూడా దూరం అయ్యాడు. పొరపాటున అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా సచిన్ అవుట్ అయ్యాడు అని తెలిస్తే అభిమానుల ఆగ్రహం మామూలుగా ఉండదు.

ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ బ్రెస్నన్ తనకు ఎదురైన ఓ ఘటన గురించి చెప్పుకుంటూ వచ్చాడు. 2011లో ఓవల్ లో జరిగిన టెస్టు మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ 91 పరుగులతో ఆడుతూ ఉన్నాడు. ఇంకొద్ది సేపు క్రీజులో ఉండి ఉంటే సచిన్ సెంచరీ కొట్టేసేవాడే.. కానీ తాను వేసిన బంతి సచిన్ లెగ్ కు తగిలింది.. నేను అప్పీల్ చేయగానే ఆస్ట్రేలియన్ అంపైర్ రాడ్ టక్కర్ అవుట్ ఇచ్చేశాడు. 91 పరుగులు చేసిన సచిన్ పెవిలియన్ బాట పట్టాడు. ఆ సెంచరీ చేసి ఉండి ఉంటే సచిన్ 100 సెంచరీ పూర్తీ చేసిన మొదటి క్రికెటర్ గా రికార్డులకు ఎక్కేవాడు. అంపైర్ తప్పుడు నిర్ణయంతో.. బంతి లెగ్ వికెట్ ను దాటి వెళుతున్నా కూడా అంపైర్ అవుట్ ఇచ్చేశాడట..!

రీప్లే చూసిన అభిమానులు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారని 'Yorkshire Cricket: Covers Off' కు బ్రెస్నన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియాలో నన్ను, అంపైర్ రాడ్ టక్కర్ ను చంపేస్తామంటూ ఎన్నో మెసేజీలు వచ్చాయి. రాడ్ టక్కర్ ఆ బంతి లెగ్ సైడ్ వెళ్ళిపోతోంది.. నీకు కనీసం తెలియదా.. సచిన్ నీ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు అంటూ పెద్ద ఎత్తున బెదిరింపులు వచ్చాయి. దీంతో బ్రెస్నన్, రాడ్ టక్కర్ లు పోలీసులను ఆశ్రయించారు. తమ ఇళ్లకు సెక్యూరిటీ కావాలంటూ పోలీసులను కోరడంతో కొద్దిరోజుల పాటూ పోలీసులు వాళ్ళ ఇంటి ముందు పహారా కాశారట.

సచిన్ 100వ సెంచరీ సాధించడానికి చాలా సమయమే పట్టింది. 2012 లో బంగ్లాదేశ్ టూర్ లో సచిన్ టెండూల్కర్ సెంచరీ సాధించి.. తన పేరున మరో రికార్డును లిఖించాడు. సచిన్ టెండూల్కర్ నవంబర్ 15, 1989న టెస్టుల్లో అరంగేట్రం చేయగా.. అదే సంవత్సరం డిసెంబర్ 18 మొదటి వన్డే మ్యాచ్ ఆడాడు. టెస్టుల్లో 15921 పరుగులు చేసిన సచిన్ 51 టెస్టు సెంచరీలు సాధించాడు. వన్డేల్లో అరవీరభయంకరమైన బౌలర్లను సచిన్ ఎదుర్కొని 18426 పరుగులు చేశాడు. 49 సెంచరీలు సాధించాడు. 24 సంవత్సరాల పాటూ భారతదేశానికి ప్రాతినిథ్యం వహించిన సచిన్ 6 వరల్డ్ కప్ లు ఆడాడు. 2011 లో భారతజట్టు వరల్డ్ కప్ గెలుచుకున్న జట్టులో సచిన్ సభ్యుడు. సొంతగడ్డపై వరల్డ్ కప్ ను అందుకుని తన కలను సాకారం చేసుకున్నాడు.

Next Story