స్పైక్‌ షూ లేవ‌ని కోచ్‌ ఆడ‌నివ్వ‌లేదు.. ద్రావిడ్‌, ల‌క్ష్మ‌ణ్‌ల‌ను అవుట్‌ చేశా..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Jun 2020 8:03 AM GMT
స్పైక్‌ షూ లేవ‌ని కోచ్‌ ఆడ‌నివ్వ‌లేదు.. ద్రావిడ్‌, ల‌క్ష్మ‌ణ్‌ల‌ను అవుట్‌ చేశా..

టీమ్‌ఇండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్.. క్రికెట్ క్రీడాభిమానుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ప‌దునైన యార్క‌ర్ల‌తో ప్ర‌త్య‌ర్ధిని ముప్పుతిప్ప‌లు పెట్టే బౌల‌ర్‌. అయితే.. తాజాగా ఉమేశ్ యాద‌వ్ క్రిక్‌బజ్‌కు ఇచ్చిన‌ ఇంట‌ర్వ్యూలో‌ మాట్లాడుతూ తన క్రికెట్ ఎంట్రీ కష్టాలను వివరించాడు.

ఉమేష్ మాట్లాడుతూ.. స్నేహితుల‌తో క్రికెట్ ఆడుతుంటే.. త‌న యార్క‌ర్లు చూసిన ఒక‌త‌ను నాగ్‌పూర్ జిల్లా జ‌ట్టుకు ఆడే అవ‌కాశం క‌ల్పించార‌ని.. అక్కడ 8 వికెట్లు తీయడంతో ఓ సమ్మర్‌ క్యాంప్‌కు పిలిచారని.. ఆ విధంగా త‌న క్రికెట్ ప్ర‌స్థానం మొద‌లైంద‌ని అన్నాడు.

U1

అయితే.. క్రికెట్ ఆడే తొలి రోజుల‌లో స్పైక్‌ షూ లేని కారణంగా ఓ కోచ్‌ తనని క్రికెట్‌ ఆడనివ్వలేద‌నే ఘటనను ‌గుర్తుచేసుకున్నాడు. ఇక త‌న కెరీర్‌లో చాలా ఆలస్యంగా కర్క్‌బాల్ క్రికెట్ ఆడాన‌ని.. అంతకుముందు ఆ బంతుల్ని కేవ‌లం టీవీలో మాత్రమే చూశానని తెలిపాడు. షూ లేకుండానే క్యాంప్‌కు వచ్చావా? ఇతడిని తీసి ఇంకొకర్ని పిలవండి. స్పైక్‌ షూ అంటే కూడా ఇతడికి తెలియదని కోచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఉమేశ్‌ పేర్కొన్నాడు. ఆ క్ష‌ణం తనకు చాలా బాధగా అనిపించిందని, వెంటనే క్రికెట్‌ను వదిలేద్దామని కూడా అనిపించినట్లు ఉమేష్‌ త‌న‌కెదురైన చేదు జ్ఞాప‌కాన్ని వివ‌రించాడు.

U2

అయితే.. తర్వాత తన స్నేహితులు ప్రోత్సహించారని, అలాంటి మాటలు పట్టించుకోకుండా ముందుకు న‌డ‌వాల‌నే ధైర్యం నింపార‌ని అన్నాడు. అలా ఆడుతుండ‌గానే.. దులీప్‌ ట్రోఫీలో రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ లాంటి దిగ్గ‌జ‌‌ ఆటగాళ్లతో ఆడే అవకాశం వచ్చిందని.. ఆ విషయం తెలిసి ముందు బాగా భయపడ్డానని.. దాంతో ‘చిన్నపిల్లాడిని చంపేద్దామని చూస్తున్నారా?’ అని జ‌ట్టు మేనేజ్‌మెంట్‌తో అన్నట్లు ఉమేశ్ గుర్తుచేశాడు. అయితే.. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు ద్రవిడ్‌, లక్ష్మణ్‌లను కూడా ఔట్‌చేశానని చెప్పాడు. దాంతో తన ఆత్మవిశ్వాసం రెట్టింప‌య్యింద‌ని పేర్కొన్నాడు.

ఇక చిన్నప్పుడు తాను చాలా అల్ల‌రిపిల్లాడిన‌ని.. మామిడి తోట‌ల‌లో దొంగ‌త‌రం కూడా చేసేవాణ్ణ‌ని.. ఎంత అల్ల‌రి చేసినా తాను ఏదో ఒకరోజు ఏదైనా సాధిస్తాననే నమ్మకం ఉండేదని.. ఉమేష్ చిన్న‌నాటి చిలిపి చేష్ట‌ల‌ను గుర్తుచేసుకున్నాడు. క్రికెట్‌ ఆడే మొద‌ట్లో త‌న‌కు ఇంటి నుంచి డబ్బులు వ‌చ్చేవికాద‌ని.. క్రికెట్‌ కిట్‌ కొనాల్సినప్పుడు ఎంత వేడి ఉన్నా పట్టించుకోకుండా రోజుకు మూడు మ్యాచ్‌లు ఆడేవాడినని ఉమేష్ త‌న క‌ష్టాల‌ను వివ‌రించాడు. ఎటువంటి స‌మ‌స్య‌కు తాను భ‌య‌ప‌డ‌న‌ని.. ఇప్పుడున్న ప‌రిస్థితి నుండి దిగ‌జారినా త‌ట్టుకోగ‌ల శ‌క్తి నాకుంద‌ని ఉమేష్ త‌న అనుభ‌వాల‌ను క్రిక్‌బ‌జ్‌తో పంచుకున్నాడు.

Next Story