బాల్కానీ నుంచి దూకేద్దామని 1,2,3 లెక్కపెట్టా : ఉతప్ప

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jun 2020 10:51 AM GMT
బాల్కానీ నుంచి దూకేద్దామని 1,2,3 లెక్కపెట్టా : ఉతప్ప

టీమ్‌ఇండియాలో చోటు దక్కకపోవడంతో ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలని బావించినట్లు భారత సీనియర్‌ ఆటగాడు రాబిన్‌ ఉతప్ప తెలిపాడు. 2007 టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో ఉతప్ప సభ్యుడు. ఆ తరువాత నిలకడ లేమితో జట్టులో స్థానం కోల్పోయాడు. క్రికెట్‌కు దూరమయ్యాక మ్యాచ్‌ ఆడలేకపోవడంతో ప్రతి రోజు నరకం అనుభవించేవాడిని, దాంతో మరణమే శరణ్యమనిపించేది. రేపు భవిష్యత్తు ఏంటి అనే ఆలోచనలతో తీవ్రంగా సతమతమయ్యేవాడిని, దాంతో బాల్కానీ నుంచి దూకేద్దామని అనిపించేదన్నాడు. కానీ ఏదో ఒక శక్తి తనను అడ్డుకుందని వెల్లడించాడు. రాయల్‌ రాజస్తాన్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన మైండ్‌, బాడీ, సోల్‌ కార్యక్రమంలో ఉతప్ప మాట్లాడాడు.

2006లో భారత జట్టులో చోటు సంపాదించానని అయితే.. అప్పటికి తన గురించి తనకు పూర్తిగా తెలియదన్నాడు. జట్టులోకి వచ్చినప్పటి నేర్చుకోవడం అలవాటు అయ్యిందని, అప్పటి నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపాడు. ప్రస్తుతం నా గురించి నాకు బాగా తెలుసు. నా ఆలోచనల్లో క్లారిటీ ఉంది. నేను కిందికి పడిపోతుంటే ఎలా పైకి వెళ్లాలనే దానిపై అవగాహన ఉంది. ఎన్నో అడ్డంకులు దాటుకునే ప్రస్తుతం ఉన్న స్థానానికి చేరుకున్నానని తెలిపాడు.

'2009-11 వరకు రోజు నేను ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొన్నాను. క్రికెట్‌ గురించి కూడా ఆలోచించలేదు. ఎప్పుడూ ఆత్మహత్య ఆలోచనలే. ఈరోజు బతికేదెలా అనే ఆలోచించేవాడిని. నా జీవితం ఎటుపోతోంది..? నేను ఏ దారిలో వెళ్తున్నాను అనే ఆలోచనలు వచ్చేవి. బాల్కానీ నుంచి దూకేద్దామని కొన్ని రోజులు కుర్చీలో కూర్చోని మూడు వరకు లెక్కపెట్టేవాడిని. కానీ ఏదో శక్తి నను ఆపేది. క్రమంగా మెరుగుపడుతూ ఆ ఆలోచనలు నుంచి బయటికొచ్చా. ఇప్పుడు కేవలం క్రికెట్‌పైనే దృష్టి పెట్టడం లేదు. పలు విషయాలపై దృష్టి సారిస్తూ నా మనసును ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. నేను వెళ్లే మార్గం సరైనదా.. కాదా అని అన్వేషించుకుంటూ నా రోటీన్‌ లైఫ్‌లో ముందుకు సాగుతున్నా’ అని ఊతప్ప తెలిపాడు.

టీమ్‌ఇండియా తరుపున ఉతప్ప 16 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)లో గతేడాది వరకు కేకేఆర్‌ (కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌) తరుపున బరిలోకి దిగగా.. ఈ సారి వేలంలో ఈ రైట్‌ హ్యాండ్‌ ఆటగాడిని రాజస్థాన్‌ రాయల్స్ రూ.3కోట్లకు దక్కించుకుంది.

Next Story