ఆ రోజు నా భార్య అందుకే ఏడ్చింది : రోహిత్‌ శర్మ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jun 2020 1:16 PM GMT
ఆ రోజు నా భార్య అందుకే ఏడ్చింది : రోహిత్‌ శర్మ

కరోనా మహమ్మారి కారణంగా క్రీడా రంగం కుదేలైంది. పలు టోర్నీలు వాయిదా పడగా.. మరికొన్ని రద్దు అయ్యాయి. లాక్‌డౌన్‌ విధించడంతో భారత్ క్రికెటర్లు ఇళ్లకే పరిమితం అయ్యారు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ తమ అనుభవాలను షేర్‌ చేసుకుంటూ ఉంటున్నారు. తాజాగా భారత క్రికెటర్‌ హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ బీసీసీఐ టీవీలో నిర్వహించిన ఓపెన్‌ నెట్స్ విత్‌ మయాంక్‌ షోలో ముచ్చటించారు. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్‌ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మూడు ద్విశతకాలు సాధించిన ఏకైక క్రికెటర్‌ హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ. ఇప్పటి వరకు ఈ రికార్డును ఎవ్వరు బ్రేక్‌ చేయలేదు. కాగా.. తన మూడో డబుల్‌ సెంచరీని గుర్తు చేసుకున్నాడు. తన భార్య రితికా స్టాండ్స్‌లో కన్నీళ్లు పెట్టుకోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. 2017లో మొహాలీ వేదికగా భారత్, శ్రీలంక మధ్య రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ వీరవిహారం చేశాడు. కేవలం 153 బంతుల్లోనే 13ఫోర్లు, 12 సిక్సర్ల బాది 208 పరుగులు చేశాడు.

'ఆ మ్యాచ్‌లో రితికా భావోద్వేగానికి లోనైంది. ఎందుకు ఏడ్చావు అని రితికాను అడిగా..? 195 పరుగుల వద్ద ఉన్నప్పుడు నేను సింగిల్స్ తీశా. పరుగు పూర్తి చేసే క్రమంలో డైవ్‌ చేశా. అప్పుడు నా చేతికి ఏమైనా దెబ్బ తగిలిందేమోనని అనుకుంది. అందుకే బావోద్వేగానికి లోనైంది. ఇక ఆ ద్విశతకం నాకు ఎప్పటికి ప్రత్యేకతే.. ఎందుకంటే ఆరోజే మా పెళ్లిరోజు కాబట్టి' అంటూ మయాంక్‌తో చెప్పుకొచ్చాడు రోహిత్‌.

2013లో ఆస్ట్రేలియాపై వన్డేల్లో తొలి సారి ద్విశతకం సాధించిన రోహిత్ ఆ తరువాత శ్రీలంకపై (2014, 2017) రెండు ద్విశతకాలు సాధించాడు. ఇప్పటి వరకు 224 వన్డేల్లో 9115 పరుగులు, 32 టెస్టుల్లో 2141 పరుగులు, 108 టీ20ల్లో 2773 పరుగులు సాధించాడు. 2019 ప్రపంచకప్ లో ఐదు శతకాలు బాదిన సంగతి తెలిసిందే.

Next Story