విదేశాల్లో ఐపీఎల్‌ 13వ సీజన్‌..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jun 2020 12:26 PM GMT
విదేశాల్లో ఐపీఎల్‌ 13వ సీజన్‌..!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని సగటు క్రీడాభిమాని ఆశగా ఎదరుచూస్తున్నాడు. కరోనా మహమ్మారి కారణంగా మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌ 13వ సీజన్‌ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దేశంలో లాక్‌డౌన్‌5.0లో సడలింపులు ఇవ్వడంతో క్రీడలు జరుగుతాయనే ఆశ నెలకొంది. అయితే.. ప్రేక్షకులు లేకుండా క్రీడలను నిర్వహించాలని పలువురు సూచిస్తున్నారు. ఒక వేళ స్వదేశంలో ఐపీఎల్‌ జరగడానికి పరిస్థితులు అనుకూలంగా లేనట్లు అయితే మరోసారి ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.

ఐపీఎల్‌ 13వ సీజన్‌ను విదేశాల్లో నిర్వహించేందుకు బోర్డు ఆలోచిస్తోందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్‌ ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'భారత్‌లో ఐపీఎల్‌ నిర్వహణకు పరిస్థితులు అనుకూలంటే ఇక్కడ నిర్వహించడానికే మా తొలి ప్రాధాన్యం. అయితే.. ఆటగాళ్ల ఆరోగ్యం విషయంలో ఎలాంటి రిస్క్‌ తీసుకోదలుచుకోలేదు. చివరి ఆప్షన్‌గా మాత్రమే విదేశాల్లో ఆడే అవకాశాలను పరిశీలిస్తాం. గతంలో దక్షిణాఫ్రికాలో మ్యాచ్‌లను నిర్వహించాం. విదేశాలకు తరలించడం ఇష్టమేం కాదు. పరిస్థితుల వల్ల ఆ ఒక్క అవకాశమే ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు' అని అరుణ్‌ ధుమాల్‌ అన్నారు.

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15వ టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. అయితే.. కరోనా ముప్పుతో ఆటోర్నీని వాయిదా వేయాలని ఐసీసీ అనుకుంటుంటోంది. దానిపై స్పష్టత రాగానే ఐపీఎల్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉంటే.. మా దేశంలో ఐపీఎల్‌ నిర్వహించుకోవచ్చునని శ్రీలంక, దుబాయ్‌ లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిని బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. 'కరోనా పరిస్థితి అంతటా ఒకేలా ఉంది. శ్రీలంకలో ఫర్వాలేదు కానీ ప్రస్తుతం అక్కడా కేసుల సంఖ్య పెరుగుతున్నాయని' అన్నారు. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షల సమస్యా ఉందన్నారు. ఒకవేళ ఐపీఎల్‌ 2020 సీజన్‌ ను వాయిదా వేస్తే బీసీసీఐ రూ.4వేల కోట్లు నష్టపోనుంది.

Next Story