రూ.50వేల కోట్లలో భారీ ప్యాకేజీ.. 20న ప్రారంభించనున్న మోదీ
By సుభాష్ Published on 18 Jun 2020 6:52 PM ISTదేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో లాక్‌డౌన్‌లో ఉండిపోయింది. ఇక లాక్‌డౌన్‌లో వ్యాపారుల నుంచి కూలీల వరకూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఉపాధి దొరక్కపోవడంతో తిరిగి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. అలాంటి కూలీలకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. రూ.50వేల కోట్లతో వారికి ఉపాధి కల్పించేందుకు ఓ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. 'గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన' పేరుతో పథకాన్ని ఈనెల 20న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు.
వసల కార్మికులు తిరిగొచ్చిన జిల్లాల గుర్తింపు
కాగా, లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో కేంద్రం అనుమతితో వారు స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఎక్కువ శాతం వలస కూలీలు తిరిగి వచ్చిన జిల్లాలో 116 ఉన్నాయని కేంద్రం గుర్తించింది. ఆ జిల్లాల్లో మొదటగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు
ఈనెల 20న ప్రారంభం
లాక్‌డౌన్ కారణంగా వలస కూలీలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టే 'గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన' పథకాన్ని ఈనెల 20న బీహార్‌లోని ఖగారియా జిల్లాలో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ పథకంలో భాగంగా మొత్తం ఆరు రాష్ట్రాల్లో 116 జిల్లాల్లో వలస కూలీలు లబ్ది పొందనున్నారని మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. బీహార్‌తో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ పథకం ప్రారంభోత్సవంలో ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా సుమారు 25వేల మందికి లబ్ధి చేకూరనుందని తెలిపారు.
వలస కార్మికులకు సొంతూళ్లలోనే ఉపాధి
వచ్చే 125రోజుల్లో సుమారు 25 పథకాలను గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్ కిందకు తీసుకువచ్చి వలస కార్మికులకు వారి సొంతూళ్లలోనే ఉపాధి చూపిస్తామన్నారు. 25 రకాలైన పనులు చేసే వారికి ఈ పథకం కింద ఉపాధి దొరకనుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తోందని మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు.