రక్తసిక్తంగా మారుతున్న రహదారులు.. ఎందరినో బలిగొంటున్న రోడ్డు ప్రమాదాలు

By సుభాష్  Published on  7 March 2020 10:46 AM GMT
రక్తసిక్తంగా మారుతున్న రహదారులు.. ఎందరినో బలిగొంటున్న రోడ్డు ప్రమాదాలు

ముఖ్యాంశాలు

► రెండు రోజుల్లో 36 మందికి పైగా మృతి

► రోడ్డు ప్రమాదాలకు సామాన్యులు బలి

► రోజురోజుకు పెరుగుతున్నరోడ్డు ప్రమాదాలు

దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. రోడ్డు ప్రమాదాలపై పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోతోంది. రహదారులంతా రక్తసిక్తంగా మారుతున్నాయి. అతివేగంగా వాహనాలు నడపడం, మద్యం తాగి నడపడం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్‌ వల్ల ఎంతో మంది సామాన్యులు ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. రెండు రోజుల్లో దాదాపు 36 మందికి పైగా మృతి చెందారు. తాజాగా శనివారం తెల్లవారుజామున బీహార్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ స్కార్పీయో వాహనం, ట్రాక్టర్‌ రెండు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కారు చెట్టుకు ఢీకొని..

ఇక గత రెండు రోజుల కిందట నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓకారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వైపు వెళ్తున్న ఏపీ 01 ఏఎఫ్ 7299 కారు ఇందల్వాయి సమీపంలో అదుపు తప్పి చెట్టును ఢీకొంది. మృతులను నిజామాబాద్‌లోని ఆర్యనగర్‌కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు.

చిన్నారికి పుట్టు వెంట్రుకలను తీయించేందుకు వెళ్తూ 13 మంది

నిన్న కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు – మంగళూరు జాతీయ రహదారిపై రెండు కార్లు ఎదురెఎదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరి కొంత మంది గాయపడగా, వారిని ఆస్పత్రికి తరలించారు. అతివేగంగా వెళ్తున్న ఓ కారు ఢివైడర్‌ను ఢీకొట్టి, ఎదురుగా వస్తున్న మరోకారును ఢీకొట్టి పల్టీలు కొట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా, 9 నెలల చిన్నారి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు వెళ్లి మృత్యువాత పడ్డారు. కునిగల్‌ తాలుకా అమరితూరు ప్రాంతంలోని బాలాడ్‌కేర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడులోని హోసూరుకు చెందిన ఓ కుటుంబం 9 నెలల చిన్నారికి పుట్టువెంట్రుకలు తీయించేందుకు తమబంధువులతో కలిసి తవేరా వాహనంలో ధర్మస్థలి మంజునాథస్వామి ధర్శనానికి వచ్చారు. అక్కడ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత హోసూరుకు వెళ్తుండగా బెంగళూరు నుంచి వస్తున్న కారు వేగంగా ఢీవైడర్‌ను ఢీకొట్టి మరో వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు తమిళనాడుకు చెందిన 9 నెలల చిన్నారి, మంజునాథ (35), గౌరమ్మ (65), తనుజా (22), రత్నమ్మ (50), రాజేందర్‌ (25), సౌందరాజన్‌ (47), ప్రసూన (15), మాలాశ్రీ (5),30), సరళ (30),లక్ష్మీ కాంత్‌ (25), సందీప్‌ ( 35), మధు (30) గుర్తించారు. కాగా, గాయపడిన వారు హర్షిత (10), గంగోత్రి (15), ప్రకాశ్‌ (25), శ్వేత (30) ఉన్నారు.

కడపలో..

అలాగే కడప జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలితీసుకుంది. జిల్లాలోని బులవారి పల్లి మండలం పరిధిలోలోని చిన్న ఓరంపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రధాన రహదారిపై లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పుల్లంపేట మండలం చెన్నగారిపల్లె గ్రామానికి చెందిన నాగినేని పాపయ్య (40), తల్లి సుబ్బమ్మ (65), కుమారుడు హరిచరణ్‌ (10)లు కువైట్‌ నుంచి చెన్నైకి వచ్చారు.

కాగా, అక్కడినుంచి సొంతూరైన పుల్లంపేటకు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో ఓరంపాడు రహదారిపై ప్రయాణిస్తున్న ఓ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కారు లోయలోకి దూసుకెళ్లి.. నలుగురు అధికారులు సహ ఐదుగురు మృతి

శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అధికారులు సహా ఐదుగురు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు బరశూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని గణేష్‌ బహర్‌ వద్ద అదుపు తప్పి లోకలోకి దూసుకెళ్లినట్లు దంతేవాడ ఎస్పీ అభిషేక్‌ వెల్లడించారు. ఇది మామూలు ప్రమాదమే అయినా.. మావోయిస్టుల కుట్ర దాగి ఉందా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. కాగా ఘటన స్థలంలోనే ఐదుగురూ మృతి చెందినట్లు చెప్పారు.

ప్రమాదంలో బీజాపూర్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ విభాగం సబ్‌ ఇంజనీర్‌ సురేంద్ర ఠాకూర్‌, క్లర్కులు రామధర్‌ పాండే, అనిల్‌ పర్సూల్‌, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ జవాను సుఖేల్‌ పాండే, కారు డ్రైవర్‌ రాజేష్‌కుమార్‌ లాంబాడీగా గుర్తించారు. జగదల్‌పూర్‌లో అధికారిక కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అలా మనకు తెలియకుండానే జరిగే రోడ్డు ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి. ఇలా ప్రతి రోజు జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అభం శుభం తెలియని చిన్నారుల నుంచి పెద్దల వరకు మృత్యువాత పడుతున్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల కొన్ని కుటుంబాలు చిన్నాభిన్నంగా మారిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరగగానే పోలీసులు, అధికారులు తూతూ మంత్రంగా నివారణ చర్యలు చేపట్టి తర్వాత వదిలేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు బయలుదేరితే చాలు మృత్యువు ఏ రూపంలో వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడం, సరైన పత్రాలు లేకుండా డ్రైవింగ్‌ చేయడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరగని రోజంటూ ఉండకుండా పోతోంది.

Next Story
Share it