గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదాలు.. 10 మంది మృతి
By సుభాష్ Published on 1 March 2020 9:54 PM IST
రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. వాహనాలు అదుపు తప్పడం, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల సామాన్యులు బలవుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఎన్ని జాగ్రత్తలు చేపట్టినా.. ప్రమాదాలు పెరుగుతున్నాయి తప్ప.. తగ్గడం లేదు. రోడ్లన్ని రక్తసిక్తంగా మారుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 10 మంది మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..
జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట ప్రాంతంలో అతివేగంగా వెళ్తున్న తుఫాన్ వాహనం వాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్సత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులంతా గుంటూరు రూరల్ మండలం ఏటుకూరులో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా కాకుమానుకు చెందిన పొగడ్త వీరలక్ష్మీ (46), పొగడ్త రమణ (45), సమాధుల శ్రీనివాస్ (50) సమాధుల వన్నూరు (53), సమాధుల సీత (65), మరొకరు ఉన్నారు.
మిర్చి లారీ బోల్తా పడి నలుగురు మృతి
జిల్లాలోని వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండా వద్ద మరో ప్రమాదం చోటు చేసుకుంది. మిర్చి లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ అదపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా నలుగురు మిర్చి రైతులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, బోధిలవీడుకు చెందిన రైతులు మిర్చిని మార్కెట్‌కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒకేరోజు కొన్ని నిమిషాల్లోనే జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 10 మంది మృతి చెందడం విషాదంగా మారింది.