స్వాతంత్య్ర సమరం నుంచి.. స్వతంత్ర భారత ప్రధాని దాకా.. సామ్యవాదం నుంచి సంస్కరణ వాదం దాకా..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Jun 2020 7:30 AM IST
స్వాతంత్య్ర సమరం నుంచి.. స్వతంత్ర భారత ప్రధాని దాకా.. సామ్యవాదం నుంచి సంస్కరణ వాదం దాకా..

భారత మాజీ ప్రధాని, దివంగత రాజకీయ నేత పీవీ నరసింహారావు 100వ జయంతి నేడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఉన్న ప్రధానమంత్రుల్లో ఉన్న ఒకే ఒక్క తెలుగు బిడ్డ.. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు (పాములపర్తి వెంకట నరసింహారావు). భారతదేశానికి 10వ ప్రధానమంత్రిగా పనిచేసిన పీవీ నరసింహారావు బహు భాషావేత్త, రచయిత కూడా.

1921, జూన్ 28వ తేదీన వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి అనే గ్రామంలో రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు జన్మించారు పీవీ. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణి లు ఆయనను దత్తత తీసుకోవడంతో ఆయన ఇంటిపేరు పాములపర్తి అయింది. కాలేజీ రోజుల్లోనే బ్రిటీష్ వారిని ధిక్కరించి వందేమాతరం పాడగా..ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ఆయనను గెంటివేయడంతో తన స్నేహితుడి ద్వారా నాగపూర్ లోని విశ్వవిద్యాలయంలో ఎల్ ఎల్ బీ పూర్తి చేసి పట్టా తీసుకున్నారు. స్వాతంత్య్రోద్యమంలో, హైదరాబాద్ విముక్తి పోరాటంలో పాల్గొన్న పీవీ నరసింహారావు ఆ తర్వాత రాజకీయ రంగప్రవేశం చేశారు.

Pv3

బూర్గుల శిష్యుడిగా పార్టీలో చేరిన పీవీ..అప్పటి నాయకులైన మర్రి చెన్నారెడ్డి, వీరేంద్ర పాటిల్, శంకర రావు చవాన్ లతో కలిసి పనిచేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిగా స్థానం సంపాదించిన పీవీ నరసింహారావు ఆ తర్వాత జర్నలిస్టు అవతారమెత్తారు. 1950 సంవత్సరంలో కాకతీయ పత్రికలో మారుపేరుతో కథనాలు రాశారు.

కలిసొచ్చిన మంథని..

1957 లో జరిగిన నియోజకవర్గ ఎన్నికల్లో తొలిసారి మంథని నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. పీవీ కి ఆ నియోజకవర్గం బాగా కలిసొచ్చినట్లుందేమో..ఆ తర్వాత వరుసగా నాలుగుసార్లు అదే నియోజకవర్గానికి పోటీ చేసి తిరుగులేని ఎమ్మెల్యేగా చక్రం తిప్పారు. 1962లో తొలిసారి మంత్రి పదవి చేపట్టిన పీవీ 1962-64 వరకు న్యాయ, సమాచార శాఖల మంత్రి గా, 1964-67 వరకూ దేవాాదాయ, న్యాయశాఖల మంత్రిగా 1967లో వైద్యారోగ్య శాఖ మంత్రిగా, 1968-71 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తించారు.

తొలిసారి ముఖ్యమంత్రి పదవి..

1969..అప్పుడప్పుడే తెలంగాణ ఉద్యమం కొద్ది కొద్దిగా చల్లారుతోంది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడున్న ముఖ్యమంత్రిని మార్చడమొక్కటే కాంగ్రెస్ ముందున్న ప్రధాన సమస్య. అందులోనూ తెలంగాణ ప్రాంత వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయకపోతే ఉద్యమం మళ్లీ ఊపందుకుంటుందన్న భయం కూడా ఉంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేల్లో ముఖ్యమంత్రి పదవిని ఆశించేవారు తక్కువేమీ లేరు. కానీ..అందరికన్నా పీవీ నరసింహారావును ముఖ్యమంత్రిని చేయడమే సబబు అనుకుంది కాంగ్రెస్.

ఆయనకంటూ ప్రత్యేక కుల వర్గం లేదు. పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానం లేకపోయినా రాష్ట్ర రాజకీయాల్లో తన కృషితో పేరు సంపాదించుకున్న వ్యక్తిగా నిలిచారు. పెద్దగా గొడవలకు వెళ్లే మనిషి కూడా కాదు. ఇవే ఆయనకు 1971, సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాయి.

అయినా ఆ పదవిని నిలుపుకోవడం పీవీకి అంత సాధ్యం కాలేదు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కీ.. ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. దాంతో రాష్ట్ర పాలన కన్నా..ఢిల్లీ - హైదరాబాద్ తిరగడమే సరిపోయేది. సరిగ్గా అదే సమయంలో భూ సంస్కరణలపై పీవీ ఓ నిర్ణయం తీసుకోగా..భూ స్వామ్య వర్గాలన్నీ తిరగబడ్డాయి. ప్రస్తుతం ఉన్న పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టాన్ని తెచ్చింది పీవీనే. ఆ తర్వాత 1972లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 70 శాతం పార్టీ సీట్లను వెనుకబడిన వర్గాలకిచ్చి చరిత్ర సృష్టించారు.

రాజీవ్ గాంధీ హత్యతో.. ప్రధానమంత్రిగా పీవీ

1973లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కేంద్రం ఆలోచనల్లో ఊహించని మార్పు వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలనను అమలు చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అనంతరం పీవీ..రాజకీయాలు ఢిల్లీకి మారాయి. వరుసగా రెండు సార్లు హనుమకొండ నుంచి లోక్ సభకు ఎన్నికైన పీవీ..మూడోసారి, నాల్గోసారి మహారాష్ట్ర లోని రాంటెక్ నుంచి లోక్ సభ స్థానానికి ఎన్నికయ్యారు. 1991లో నంద్యాల ఉప ఎన్నికలో గెలిచి 10వ లోక్ సభలో అడుగుపెట్టారు. అలా వరుసగా ఐదుసార్లు లోక్ సభ సభ్యుడిగా పనిచేశారు పీవీ.

1991లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో పీవీ పోటీ చేయలేదు. ఆయన దాదాపు పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుని రాజకీయ సన్యాసం తీసుకుందామనుకుంటున్న సమయంలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఆ సమయంలో అర్జెంటుగా ప్రధానమంత్రిని నియమించడం కాంగ్రెస్ కు తలకుమించిన భారంగా అనిపించింది. అప్పుడున్న నాయకుల్లో ఎవరికీ ప్రధానమంత్రి పదవి చేపట్టి.. దేశాన్ని పాలించేంత అనుభవం లేకపోవడంతో అందరికీ పీవీనే సరైన వ్యక్తిలా కనిపించారు. పార్టీ పిలవడంతో వానప్రస్థం వరకూ వెళ్లిన పీవీ మళ్లీ వెనక్కి వచ్చి..ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. నెహ్రూ, గాంధీ కుటుంబాల వెలుపల తొలి ప్రధానమంత్రిగా నియమితులైన తొలి తెలుగు వ్యక్తి పీవీనే.

Pv1

అలా అనుకోకుండా భారత 10వ ప్రధాన మంత్రిగా ఎన్నికైన పీవీ 1991 నుంచి 1995 వరకూ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఎన్నో అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో మన్మోహన్ కు పూర్తి స్వేచ్ఛనివ్వగా..ఆయన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలిగారు. మన్మోహన్ కు ఆర్థిక వ్యవస్థపై పూర్తి స్వేచ్ఛనివ్వకపోయుంటే..ఇప్పుడు ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పీవీ గురించి చెప్పుకునేవాళ్లం కాదేమో.

అధికారంలో ఉండగా.. అధికారం వీడాక కూడా పీవీని వెంటాడిన అవినీతి ఆరోపణలు

రాజకీయాల్లోకి వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే కాస్త పేరు సంపాదిస్తే చాలు..అవినీతి ఆరోపణలు రావడం సహజం. అలాగే పీవీ నరసింహారావును కూడా చాలా అవినీతి ఆరోపణలు వెంటాడాయి. రాజకీయాల్లోకి వచ్చింది మొదలు.. ఆయన చనిపోవడానికి ఏడాది ముందు వరకూ కూడా కేసులు వెంటాడాయి.

జార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి కేసు : పార్లమెంటులో మెజారిటీ సాధనకై జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యులకు పీవీ లంచాలు ఇచ్చాడనే ఆరోపణ ఇది. ఈ ఆరోపణలను విచారించిన ప్రత్యేక కోర్టు జడ్జి అజిత్ భరిహోక్ 2000 సెప్టెంబరు 29న పీవీని ఈ కోసులో దోషిగా తీర్పునిచ్చాడు. నేరస్తుడిగా కోర్టుచే నిర్ధారించబడిన మొట్టమొదటి మాజీ ప్రధానమంత్రి, పీవీ. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది.

సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసు: 1989 లో బోఫోర్స్ అవినీతిపై రాజీవ్ గాంధీతో విభేదించి, ప్రభుత్వం నుండి, పార్టీ నుండి బయటకు వచ్చేసిన వి.పి. సింగ్‌ను అప్రతిష్ట పాల్జేసేందుకు, కుమారుడు అజేయ సింగ్ ను ఇరికించేందుకు ఫోర్జరీ సంతకాలతో సెయింట్ కిట్స్ ద్వీపంలో ఒక బ్యాంకులో ఎక్కౌంటు తెరిచిన కేసది.

లఖుభాయి పాఠక్ కేసు: లఖుభాయి పాఠక్ అనే పచ్చళ్ళ వ్యాపారి ప్రభుత్వంతో ఏదో ఒప్పందాలు కుదుర్చుకొనేందుకై పీవీకి సన్నిహితుడైన చంద్రస్వామికి డబ్బిచ్చానని ఆరోపించాడు. ఈ మూడు కేసుల్లోనూ పీవీ నిర్దోషిగా నిరూపించుకున్నారు.

2004 డిసెంబర్ 23వ తేదీన పీవీ నరసింహారావు తుదిశ్వాస విడిచారు. అప్పట్లో ఆయన మరణం, అంత్యక్రియలపై సన్నిహితులు, అభిమానులకు చాలా అనుమానాలు తలెత్తాయి. కానీ కాలం గడిచే కొద్దీ అవన్నీ మరుగున పడిపోయాయి.

Pv2

సాధారణంగా భారత ప్రధానిగా పనిచేసిన వ్యక్తి మరణిస్తే వారి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఢిల్లీలో నిర్వహించాల్సి ఉంటుంది. పీవీ కుటుంబం కూడా ఇదే కోరుకుంది. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ పీవీ అంత్యక్రియలను ఢిల్లీలో నిర్వహించేందుకు ఒప్పుకోలేదు. దాంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. పీవీ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి హైదరాబాద్ లో అంత్యక్రియలు చేసేందుకు ఒప్పించారు.

పీవీ నరసింహారావు భౌతికకాయం హైదరాబాద్ కు వచ్చాక కనీసం కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల సందర్శనార్థం కొద్దిసేపు కూడా పార్టీ కార్యాలయంలో ఉంచేందుకు అనుమతించలేదు. ఆఖరికి హుస్సేన్ సాగర్ తీరంలో ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఆ తర్వాత కూడా టీవీ ఛానళ్లు పీవీ భౌతిక కాయం సగమే కాలిందని, మిగతా శరీరాన్ని కుక్కలు బయటికి లాగాయంటూ వీడియోలు ప్రసారం చేయడంతో.. ఆ విషయం సంచలనమైంది. ఈ విషయాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారి, పీవీకి సన్నిహితుడైన పీవీఆర్కే ప్రసాద్ ఖండించారు. శరీరం పూర్తిగా కాలింది. కాకపోతే కాలిపోయిన శరీరపు బూడిద అదే ఆకారంగా కనిపించడంతో ప్రజల మనస్సులో అదే ఉండిపోయిందని చెప్పుకొచ్చారు.

Next Story