ప్ర‌ధాని మోదీతో భేటీ త‌రువాత ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

Pawan Kalyan key comments after meeting with PM Modi.ప్ర‌ధాని మోదీ-జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మ‌ధ్య 35 నిమిషాల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Nov 2022 2:37 AM GMT
ప్ర‌ధాని మోదీతో భేటీ త‌రువాత ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజకీయాల్లో హాట్‌టాఫిక్‌గా మారిన అంశం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ కావ‌డం. ఎనిమిదేళ్ల త‌రువాత వీరిద్ద‌రి మ‌ధ్య‌భేటీ జ‌రిగింది. శుక్ర‌వారం రాత్రి రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం మోదీ విశాఖప‌ట్నానికి వ‌చ్చారు. నౌకాద‌ళ స్థావ‌రంలోని ఐఎన్ఎస్ చోళ అతిథిగృహంలో ప్ర‌ధాని మోదీ-జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మ‌ధ్య దాదాపు 35 నిమిషాల పాటు భేటీ సాగింది. రాష్ట్రంలో ప్ర‌స్తుత ప‌రిస్థితులు, రెండు పార్టీలు క‌లిసి ప‌నిచేయ‌డం వంటి విష‌యాల‌పై చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. ఈ కీలక సమావేశానికి పవన్ తో పాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు.

ఇక భేటీ ముగిసిన అనంత‌రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. దాదాపు ఎనిమిదేళ్ల త‌రువాత ప్ర‌ధాని మోదీని క‌ల‌వ‌డం సంతోషంగా ఉన్న‌ట్లు చెప్పారు. ఈ స‌మావేశం భ‌విష్య‌త్తులో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మంచి రోజులు తీసుకువ‌స్తుంద‌ని ప్ర‌గాఢంగా విశ్వ‌సిస్తున్న‌ట్లు ప‌వ‌న్ తెలిపారు.

"ప్రధాని మోదీని 8ఏళ్ల త‌రువాత‌ కలవ‌డం సంతోషంగా ఉంది. 2014లో బీజేపీ గెలిచిన త‌రువాత ప్ర‌ధానిగా ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేసే ముందు క‌లిశా. ఆ త‌రువాత అనేక సార్లు ఢిల్లీ వెళ్లినా ఎప్పుడూ క‌లిసింది. లేదు. ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా ప్రధాని ని కలవాలని పీఎంవో ఆఫీస్ నుంచి నాకు రెండు రోజుల క్రితం పిలుపొచ్చింది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీని కలిశా. ఇది ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన సమావేశం. ఈ సమావేశంలో ఏపీ పరిస్థితులపై ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ బాగుండాలని, ఏపీ ప్రజలు ఆనందంగా ఉండాలని, ప్రజలు అభివృద్ధి చెందాలని, దానికోసం కృషి చేస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ప్రధానితో నా మీటింగ్.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మంచి రోజులు తీసుకొస్తుందని నేను ప్రగాడంగా నమ్ముతున్నా." అని పవన్ అన్నారు.

కాగా.. విశాఖలో ఇటీవల జరిగిన పరిణామాలపై ప్రధానితో మాట్లాడారా? అన్న ప్రశ్నకు పవన్ సమాధానం దాటవేశారు. ఇవన్నీ త్వరలో తెలియజేస్తానని మీడియా సమావేశాన్ని ముగించారు.

Next Story