Opinion : తెలంగాణ ఎన్నికలలో ఓటర్లు అభివృద్ధి వైపు చూస్తున్నారా.. సెంటిమెంట్ గురించే ఆలోచిస్తూ ఉన్నారా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గట్టి పోటీ కనిపిస్తోంది. ఎవరు అధికారం లోకి రాబోతున్నారు..
By న్యూస్‌మీటర్ తెలుగు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గట్టి పోటీ కనిపిస్తోంది. ఎవరు అధికారం లోకి రాబోతున్నారు.. ఎవరికి లాభం కలుగుతుందని.. ప్రజలు ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. అయితే ప్రజలు ఎవరికి ఓటు వేయబోతున్నాము? ఏ పార్టీని అందలం ఎక్కించబోతూ ఉన్నారనే ప్రశ్నలకు సమాధానం అతి త్వరలోనే రానుంది.
గత రెండు ఎన్నికలతో పోలిస్తే తెలంగాణ సెంటిమెంట్ ప్రభావం కాస్త తగ్గిపోయిందని చెప్పవచ్చు. కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డాక ఎవరికి ఎక్కువ ప్రయోజనం చేకూరింది.. ఎవరికి లాభం ఉంది అనే విషయంపై దృష్టి సారించారు. ఇక మాటల యుద్ధం, అధికారం కోసం సాగుతున్న ఆటలు, రాజకీయ పార్టీల మనుగడ కోసం ఈ ఎన్నికలు ముందుకు పోతున్నాయి. ఓటర్లు పాత వాగ్దానాలను మనసులో పెట్టుకున్నారు.. కొత్త వాగ్దానాల గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇక గత అనుభవాలతో నవంబర్ 30 న ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌లకు వెళుతున్నారు.
ఒక క్లోజ్ ఫైట్
తెలంగాణలో.. భారత రాష్ట్ర సమితి (BRS), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC), భారతీయ జనతా పార్టీ (BJP), ఆల్ ఇండియా మజ్లిస్-E-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) మధ్య అసలైన పోటీ ఉంది.
అయితే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, కేసీఆర్‌తో తెలంగాణకు అనుబంధం వంటి విషయాలను బీఆర్‌ఎస్ ప్రజల్లోకి తీసుకుని వెళ్ళింది. గత తొమ్మిదిన్నరేళ్లలో చేసిన పాలన మీద నమ్మకంతో మళ్లీ మూడోసారి అధికారంలోకి రావడానికి కృషి చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ యాంటీ-ఇంకంబెన్సీ ఫ్యాక్టర్, యువతకు ఉద్యోగాల కొరత, ప్రాజెక్టులలో అవినీతి, రాష్ట్ర అప్పుల కారణంగా ప్రజలు మార్పును కోరుతున్నారని భావిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ హామీలు, మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలు కూడా తెలంగాణ ప్రజలను ఆకర్షించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ ఎక్కడైతే వెనుకబడిందో.. అక్కడ బీజేపీ లాభపడుతుంది:
ఈ ఎన్నికల్లో బీజేపీ కాస్త వెనుకంజలో ఉంది, అయితే కొన్ని విషయాలను బీజేపీ కూడా క్యాష్ చేసుకుంటోంది. అభ్యర్థుల ఎంపికలో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ బలమైన అభ్యర్థిని ప్రకటించింది. అలాంటి చోట బీజేపీ దూసుకుపోతోంది. బీజేపీ ముద్ర ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరింత పుంజుకోడానికి ప్రయత్నిస్తూ ఉంది. పలువురు ప్రముఖులు కూడా ఆయా ప్రాంతాల్లో ప్రచారానికి వచ్చారు. లోక్‌సభ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఈ చర్యలు తీసుకుంటూ ఉంది.
AIMIM.. ముస్లిం ఓట్లు:
ఈ ఎన్నికల్లో తాము పొత్తు పెట్టుకున్న బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరుతూ అన్ని వర్గాల ప్రజలను ఏఐఎంఐఎం కోరుతోంది. తెలంగాణలోనే కాకుండా భారతదేశం అంతటా ముస్లిం ఓట్ల విభజనకు AIMIM కాంగ్రెస్ పార్టీని నిందించింది. కాంగ్రెస్ పార్టీ మీద గతంలో కంటే ఎక్కువగా వ్యతిరేక ప్రచారం చేసింది ఎంఐఎం. ఈ ప్రచారం ముస్లిం ఓటర్లు ఉన్న ప్రాంతాలలో ప్రభావం చూపనుంది. ఇక పాతబస్తీలో ప్రజలు ఎవరికి ఓటు వేస్తారనేది చర్చనీయాంశమైంది.
ఈసారి డబ్బు, మద్యం పనికొస్తాయా?
గతంలో జరిగిన ఎన్నికల్లో పెద్దఎత్తున డబ్బు, మద్యం పంచారు. ఈసారి ఎన్నికల్లో అవి పనికిరావని భావిస్తున్నారు. ప్రజలు అందరి దగ్గర డబ్బులు తీసుకుంటారు కానీ ఎలాగైనా తమకు నచ్చిన పార్టీకే ఓటు వేస్తారనే విషయాన్ని గుర్తించాలి. పోలీసులు ఇప్పటి దాకా పట్టుకున్న డబ్బు తెలంగాణలో రూ.700 కోట్లు దాటింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మొత్తం ఐదు రాష్ట్రాలలో తెలంగాణ ట్రాక్ రికార్డు చాలా పెద్దది.
ఒక్కొక్కరు ఒక్కో వైపు:
మెజారిటీ ఓటర్లు ఎవరికి ఓటు వేయాలో అనే విషయాన్ని నిర్ణయించుకున్నారు. ఇంకొందరు పథకాల ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న వారు, కాంట్రాక్ట్‌ల కోసం నిశ్శబ్ధంగా ఉన్న వ్యాపారవేత్తలు ఉన్నారు. ఎన్నికల తర్వాత ఎదురుదెబ్బ తగులుతుందనే భయంతో నోరు మెదపకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ గత, ప్రస్తుత అనుభవాల ఆధారంగా భిన్నమైన ఆలోచనతో ఉన్నారు.
రూరల్ Vs సెమీ అర్బన్ Vs అర్బన్
గతంలో తెలంగాణ ఎన్నికల సమయంలో సెంటిమెంట్ విలువలకు పెద్దపీట వేసినట్లుగా ఈ ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతంలోని ప్రజల తీరు ఒకలా ఉంది. సెమీ-అర్బన్ జనాభా తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. రాష్ట్రం తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల హర్షించని యువకులు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో, అభివృద్ధి చెందిన నగగాల్లో సమస్యలు, భారమైన మౌలిక సదుపాయాలు ఉండడంతో ఈ సమస్యలకు సమాధానం వెతుకుతున్నారు జనం.
దేశం Vs రాష్ట్రం
ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి రాష్ట్రం పాత్ర, కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధాలపై చర్చ సాగింది. ఒకప్పుడు దీనిపై గుసగుసలే ఎక్కువగా వినిపించేవి.. కానీ ఇప్పుడు బహిరంగంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓటర్లు వివిధ విషయాలను, సంబంధాలను నిశితంగా గమనిస్తూ ఉన్నారు. అయితే ఎవరు రాష్ట్రానికి మంచి చేస్తున్నారనే విషయం కూడా గుర్తు పెట్టుకుంటూ ఉన్నారు. అన్నిటికీ సమాధానం డిసెంబర్ 3న మాత్రమే తెలుస్తుంది.
తెలంగాణలో ఎన్నికల ఫలితాలు.. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి. ప్రజలు రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో, తమ ఇళ్ల నుండి బయటకు వెళ్లి ఓటు వేసి తమ నిర్ణయాన్ని తెలియజేయనున్నారు.
Credits : Kaniza Garari
Disclaimer: The views and opinions expressed in the article are those of the author and do not reflect the official policy or position of NewsMeter