Ground Report : మహబూబ్ నగర్ వాసుల గల్ఫ్ కలలే బీఆర్ఎస్, కాంగ్రెస్ టార్గెట్

మహబూబ్‌నగర్‌ లో మౌలిక సదుపాయాలు పెరుగుతూ ఉండడంతో.. ఈ ప్రాంత అభివృద్ధి కొనసాగుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Nov 2023 8:53 PM IST
Ground Report : మహబూబ్ నగర్ వాసుల గల్ఫ్ కలలే బీఆర్ఎస్, కాంగ్రెస్ టార్గెట్

మహబూబ్‌నగర్‌ లో మౌలిక సదుపాయాలు పెరుగుతూ ఉండడంతో.. ఈ ప్రాంత అభివృద్ధి కొనసాగుతూ ఉంది. ఫార్మా సిటీలో పనిచేస్తున్న ఫార్మా ఉద్యోగులు ఈ ప్రాంతంలో భారీ సంఖ్యలో ఉన్నారు. ఫార్మా సిటీ, పట్టణీకరణ కారణంగా అనేక అనుబంధ వ్యాపారాలు వేగంగా అభివృద్ధి చెందాయి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై నగరంలోని వ్యాపారవేత్తలు మాత్రం తమ అభిప్రాయాల గురించి పెదవి విప్పడం లేదు. మహబూబ్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్‌ పై కాంగ్రెస్‌ తరపున వై.శ్రీనివాస్‌రెడ్డి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మిథున్‌కుమార్‌రెడ్డి బరిలోకి దిగారు.

చిరు వ్యాపారులకు భద్రత కావాలి

ఫార్మా సిటీ స్థాపన, రియల్ ఎస్టేట్ అభివృద్ధి తర్వాత ఎన్నో చిన్న తరహా వ్యాపారాలు ఎక్కువ అయ్యాయి. వాణిజ్యం కూడా బాగా పెరిగింది. అయితే వారికి భద్రత కరువైంది. చిన్న వ్యాపారాల ప్రాధాన్యతను గుర్తించి భద్రతను కల్పించాలంటూ కోరుతున్నారు. "అభివృద్ధి చెందే ప్రాంతంలో మాపై ఎలాంటి తప్పుడు కేసులు అవసరం లేదు.. బెదిరింపులు కూడా జరుగుతున్నాయని" అని ఒక ఫార్మసీ యజమాని చెప్పారు. అంతేకాకుండా నివాస ప్రాంతాలు కూడా చాలా దూరంగా వెళ్లాయని చెబుతున్నారు.

గొలుసు దుకాణాలను కలిగి ఉన్నవారు స్థిరమైన అభివృద్ధి, డ్రైనేజీ, పారిశుధ్యం, పరిశుభ్రతకు సంబంధించి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరుకుంటున్నారు. అబ్దుల్ మజీద్ అనే స్థిరాస్తి వ్యాపారి మాట్లాడుతూ, “అన్నిటినీ శాసనసభ సభ్యుడు వి శ్రీనివాస్ గౌడ్ నిర్ణయిస్తారు కాబట్టి మున్సిపల్ కౌన్సిలర్లకు పెద్దగా చెప్పాల్సిన పని లేదు. రెసిడెన్షియల్ కాలనీల్లో చాలా మునిసిపల్ పనులు పెండింగ్ లో ఉన్నాయి, అవి ఇంకా పూర్తికాలేదు." అని అన్నారు.

సహాయం కోరుతున్న గల్ఫ్ కార్మికులు:

చాలా మంది వ్యక్తులు పని కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లడంతో, మహిళలు పూర్తి సమయం ఇంటి పనులే చేసుకుంటూ ఉన్నారు. మహిళల్లో చాలా మందికి ఉపాధి లేక ఇళ్లు, వీధులకే పరిమితమవుతున్నారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు జీవిత భాగస్వామిని చేరుకోవడం కూడా పెద్ద సవాలు. వలస కార్మికుల కోసం పనిచేస్తున్న జికె రావు మాట్లాడుతూ, “ఆయా కుటుంబాల్లో ఏదైనా జరగరానిది జరిగినప్పుడు కుటుంబానికి స్థానిక ప్రభుత్వం నుండి చాలా తక్కువ సహాయం లభిస్తూ ఉంది. కుటుంబాల మనుగడ కోసం ప్రాథమిక హక్కుల కోసం పోరాడుతున్నాం. అయితే, ప్రస్తుత ప్రభుత్వంపై ఎలాంటి నమ్మకం లేదు" అని అన్నారు.

భూమి పోతుందనే భయం:

మహబూబ్‌నగర్ హైవే, ఆ చుట్టుపక్కల భారీ వెంచర్‌లను ప్రకటించడం వల్ల, చాలా మంది చిన్న సన్నకారు రైతులు భూములు పోతాయనే భయంతో ఉన్నారు. “భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. రైతులు తమ భూములను విక్రయించడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఆ డబ్బులు తీసుకున్న తర్వాత వాటిని ఎలా వినియోగించాలో తెలియడం లేదు. భూములిచ్చేశాక చాలా మంది పని లేకుండా పోతున్నారు. విదేశాల్లోనే కాకుండా భారతదేశంలో కూడా ఈ ప్రాంతంలో వలసలు పెరగడానికి ఇది ఒక ప్రధాన కారణం ”అని పట్టణానికి చెందిన పి భార్గవ్ అన్నారు.

మహబూబ్ నగర్

జిల్లాలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంది. ‘‘మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సమస్యల గురించి మాట్లాడినా లేదా సమస్యలపై స్పందించినా కూడా టార్గెట్ అవుతున్నారు. ప్రజలు మార్పును కోరుకోవడానికి ప్రధాన కారణాలలో ఒకటి, ” అని ఓ అజ్ఞాత వ్యక్తి తెలిపాడు.

మహబూబ్‌నగర్‌లో మైనారిటీల జనాభా ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన చర్చలు, సమావేశాల్లో వారు ఎక్కువగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత వారిలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. అయితే మహబూబ్‌నగర్ ఓటర్లు ఎవరిని ఎన్నుకుంటారో ఇప్పుడే తేల్చేయడం కష్టమే. ఓటింగ్ రోజు మాత్రమే తమ నిర్ణయం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు తప్పితే.. బహిరంగంగా ఏ పార్టీకి విధేయత చూపిస్తున్నామో చెప్పడానికి ప్రజలు సుముఖంగా లేరు.

Next Story