జైలు నుండి విడుదలై 24 గంటలు గడవకముందే.. జేసీపై మళ్లీ కేసులు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Aug 2020 3:35 PM ISTవాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టయిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలు 54 రోజుల తర్వాత కడప జైలు నుంచి నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. జేసీ విడుదల సందర్భంగా కడప జైలు వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఈ నేపథ్యంలో కడప జైలు వద్ద కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్, జేసీ పవన్ సహా 31 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొవిడ్ నియమావళిని ఏమాత్రం పట్టించుకోలేదన్న కారణంతో కేసు నమోదైనట్టు తెలుస్తోంది.
అంతేకాకుండా.. నిన్న జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి మరో వివాదంలోనూ చిక్కుకున్నారు. కడప నుంచి ఆయన తాడిపత్రికి చేరుకునే క్రమంలో భారీ కాన్వాయ్ తరలి వచ్చింది. దీనిపై తాడిపత్రి సీఐ దేవేందర్ అభ్యంతరం వ్యక్తం చేయగా, జేసీ ఆయనతో జేసీ ప్రభాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు.
ఈ సంఘటనపై విచారణ జరిపిన అనంతపురం పోలీసులు జేసీపై పలు సెక్షన్ల (ఐపీసీ 353తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసీటి) కింద కేసులు నమోదు చేశారు. జైలు నుంచి విడుదలై 24 గంటలు గడవక ముందే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరో మూడు కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.