'పోలీస్‌స్టేషన్ పై దండెత్తిన వైఎస్ జగన్'.. ఏపీ సీఎంపై పవన్‌కళ్యాణ్ వివాదస్పద ట్వీట్.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Nov 2019 2:40 PM ISTఏపీ సీఎం వైఎస్ జగన్ ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న పవన్.. సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా 1996 లో పౌరహక్కులు వారు ప్రచురించిన 'కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం' పుస్తకంలో ఏపీ సీఎం జగన్ గురించి ప్రస్తావించారంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు.
పవన్ ట్వీట్ లో ముందుగా ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్థానిక భాషల సంవత్సరం సందర్భంగా 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రస్తావించింది విని.. శ్రీ జగన్ రెడ్డి గారు, మిగతా వైసీపీ సమూహం, ఎలా స్పందిస్తారో విందామని వేచిచూస్తున్నానని ట్వీట్ చేశారు.
అలాగే.. రాయలసీమలో దళిత కులాలపై దాడుల అంశాన్ని కూడా లేవనెత్తారు. మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా ఉంది రాయలసీమలోనేనని, దళిత కులాల మీద దాడులు జరిగిన, బయటకి వచ్చి చెప్పటానికి భయపడతారు. ఇంకా మిగతా వారు ముఠాలు చెప్పింది ,మౌనంగా వినటమే. పోరాట యాత్రలో నన్ను యువత కలిసి వారి బాధలు వెళ్లపోసుకుంటుంటే నా గుండె కలిచి వేసిందని భావోద్వేగభరిత ట్వీట్ చేశారు. దీనికి కొనసాగింపుగా మరో ట్వీట్‌లో.. కర్నూలులోని ఒక రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని, 14 ఏళ్ల ‘సుగాలి ప్రీతి ‘ ఉదంతాన్ని ఉదాహరించారు. అలాగే పౌరహక్కులు వారు ప్రచురించిన పుస్తకంలో '75వ పేజీలో శ్రీ జగన్ రెడ్డి' గారి ప్రస్తావన కూడా ఉందంటూ పేజీ నంబర్ తో సహా ట్వీట్ చేశారు.
పవన్ వెల్లడించిన కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం పుస్తకంలో 75వ పేజీని తెరిచిచూసే ప్రయత్నం చేసిన న్యూస్ మీటర్ కు విస్తుపోయే విషయాలు తెలిసాయి. సీఎం జగన్ ఒకప్పుడు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని.. సింహాద్రిపురం పోలీసు స్టేషన్‌పై దండెత్తి.. ఎస్సై పై దాడి కూడా చేశాడని ఆ పుస్తకంలో ప్రస్తావించారు.
అసలే విమర్శలు, ప్రతివిమర్శలతో కాక రేపుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయం.. పవన్ ట్వీట్లతో ఒక్కసారిగా వేడెక్కింది. పవన్ ట్వీట్లపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో.. తదనంతర పరిణామాలు ఎటువంటి విమర్శలకు, చర్చలకు దారి తీస్తాయో వేచిచూడాల్సిందే.