భారత్‌కు రఫేల్ వస్తే పాకిస్థాన్‌కు ఎందుకో అంత బాధ.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 July 2020 4:06 PM GMTరఫేల్ యుద్ధ విమానాలు భారత్‌లో దిగాయి. ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఐదు రఫేల్ ఫైటర్ జెట్స్ హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్‌లో సురక్షితంగా దిగాయి. ఫ్రాన్స్ నుంచి మొత్తం 36 యుద్ధ విమానాలను రూ.58వేల కోట్లకు భారత్ ఒప్పందం కుదుర్చుకోగా.. 2021 నాటికి మొత్తం యుద్ద విమానాలు భారత్‌కు చేరుకోనున్నాయి. చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో రఫేల్ యుద్ధ విమానాలు లడఖ్ ప్రాంతంలో మోహరించే అవకాశం ఉంది.
రఫేల్ యుద్ధ విమానాలు భారత్ లోకి అలా అడుగుపెట్టాయో లేదో అప్పుడే పాకిస్థాన్ తన బాధనంతా వెళ్లగక్కుతోంది. భారత్ కు రాఫెల్ విమానాలు అవసరమే లేదని చెబుతోంది. దేశ భద్రతకు కావాల్సిన అవసరాలకు మించి సైనిక సామర్థ్యాలను కూడగట్టుకుంటోందని.. ఇలా చేయడం వలన దక్షిణాసియాలో ఆయుధ పోటీకి దారితీస్తుందని నంగనాచిలా వ్యాఖ్యలు చేస్తోంది. అంతేకాదు భారత్ ను నిలువరించాలని ప్రపంచ దేశాలను కోరుతున్నామని పాక్ విదేశాంగ శాఖ ప్రకటనలో తెలిపింది.
పాకిస్థాన్-చైనాలు తోక జాడించకూడదన్నదే భారత్ ఉద్దేశ్యం. అందులో భాగంగానే ఈ భారీ డీల్ ను చేసుకుంది భారత్. ఈ రఫేల్ లో ఉన్న స్పెషాలిటీలే పాకిస్థాన్ ను తెగ భయపెడుతున్నాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రపంచంలోని అత్యాధునిక ఆయుధాలను ప్రయోగించగల సత్తా ఈ రఫేల్‌కు ఉంది. 9,500 కిలోల ఆయుధాలను మోసుకెళ్లే సత్తా ఉంది.
అణు క్షిపణిని ప్రయోగించే సామర్థ్యం ఈ రఫేల్ ఫైటర్ జెట్లకు ఉంది. రఫేల్‌లో రెండు రకాల క్షిపణులు ఉంటాయి. ఒకదాని సామర్థ్యం 150 కిలోమీటర్లు. రెండో దాని సామర్థ్యం సుమారు 300 కిలోమీటర్లు. అంతేకాదు రఫేల్ గాలిలో నుంచి గాలిలో 150 కిలోమీటర్ల దూరం వరకూ క్షిపణిని ప్రయోగించే సత్తా ఉంటుంది. గాలిలో నుంచి భూమిపైకి 300 కిలోమీటర్ల వరకు క్షిపణిని ప్రయోగిస్తుంది.
ఇక ఈ యుద్ధ విమానం గంటకు 1389 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. వీటి ఎత్తు 5.30 మీటర్లు, పొడవు 10.30 మీటర్లు. ఈ విమానాలు గాలిలోనే ఇంధనం నింపుకోగల సత్తా ఉంటుంది. రఫేల్ విమానాల్లో సార్ రేడార్లు ఉంటాయి. సింథటిక్ అపచ్యూర్ రేడార్ సాధారణంగా జామ్ కాదు. లాంగ్ రేంజ్ టార్గెట్‌లను ఈ రేడార్ గుర్తిస్తుంది. రేడార్ జామ్ కాకుండా ఉండే సదుపాయాలు కూడా ఉన్నాయి.
రఫేల్‌లో ఉన్న రేడార్ కనీసం వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న శతృ టార్గెట్‌ను గుర్తించగలదు. ఈ యుద్ధ విమానాల్లో ఆధునిక 30ఎంఎం కెనాన్ ఆయుధాలు ఉంటాయి. అవి 125 రౌండ్ల కాల్పులు జరపగలవు. ఆకాశం నుంచి నేలపై ఉన్న టార్గెట్‌ను స్ట్రయిక్ చేస్తాయి. లడఖ్ లాంటి పర్వత ప్రాంతాల్లో ఉన్న బలమైన కట్టడాలను, బంకర్లను కూడా హమ్మర్ మిస్సైల్ ధ్వంసం చేయగలదు.
2016 సెప్టెంబర్‌లో భారత్ – ఫ్రాన్స్ మధ్య రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం కుదిరింది. రక్షణ అవసరాల నిమిత్తం ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ విమానాలను కొనుగోలు చేస్తున్నారు. వీటి కోసం భారత్ ప్రభుత్వం రూ.58వేల కోట్లు ఖర్చు చేసింది. మొదటి దశగా ఐదు విమానాలు భారత్ కు చేరుకున్నాయి. అయిదు విమానాలకే పాకిస్థాన్ ఇంత ఓవరాక్షన్ చేస్తోందంటే.. మొత్తం విమానాలు వస్తే ఇంకా గగ్గోలుపెట్టుకుంటుందేమో..!