కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన డిప్యూటీ స్పీకర్
By Medi Samrat Published on 14 July 2020 11:10 AM GMTఇటీవల కరోనా మహమ్మారి నుండి కోలుకున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారు. కరోనా నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే బోనాల పండుగ జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే.. పద్మారావు గౌడ్ మాత్రం బోనాల ఉత్సవాల్లో భౌతిక దూరం పాటించకుండా.. మాస్క్ ధరించకుండా ఉత్సవాల్లో పాల్గొని మరోమారు హాట్ టాఫిక్ అయ్యారు.
గత వారమే కరోనా నుండి కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్న పద్మారావు గౌడ్.. ఉత్సవాలకు అనుమతి లేకున్నా తన ఇంటి ముందుకొచ్చిన ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకరే ఇలా వ్యవహరించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇదిలావుంటే.. తాను పద్మారావు గౌడ్‌కు మాస్క్ ఇస్తే మడిచి జేబులో పెట్టుకున్నారని.. హైదరాబాద్ వాళ్లం గట్టిగా ఉంటామని చెప్పారని ఇటీవల ఓ సభలో మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. మంత్రి చురకలు అంటించినప్పటికీ.. కరోనా బారినపడి బయటపడ్డ పద్మారావు గౌడ్ ఇలా వ్యవహరించడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ కౌన్సిలర్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన పద్మారావు గౌడ్.. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి లో 2001లో చేరారు. 2004లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటిచేసి కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
పద్మారావు మూడు పర్యాయాలు 2004, 2014, 2018 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2008 సికింద్రాబాద్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో, 2009 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు.
రాష్ట్ర విభజన తర్వాత.. 2014లో జరిగిన ఎన్నికలలో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, తెలంగాణ తొలి కేబినెట్ లో ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2018 ఎన్నికల్లో మరోమారు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పద్మారావు గెలుపొందారు. ప్రస్తుతం ఆయన డిప్యూటీ స్పీకర్‌గా కొసాగుతున్నారు.