'మహా' కురుక్షేత్రానికి ముగింపు రేపే..!

By అంజి
Published on : 26 Nov 2019 12:46 PM IST

మహా కురుక్షేత్రానికి ముగింపు రేపే..!

ముఖ్యాంశాలు

  • మహారాష్ట్రలో బలపరీక్షపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
  • శాసనసభలో బలపరీక్ష నిర్వహించాలన్న సుప్రీం
  • అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్‌ను వెంటనే నియమించాలన్న సుప్రీం
  • బలపరీక్షపై సీక్రెట్ బ్యాలెట్ అవసరం లేదు: సుప్రీంకోర్టు
  • బలపరీక్ష మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేయాలి: సుప్రీంకోర్టు

రేపే బలపరీక్ష..

ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు ఓ కొలిక్కి వచ్చాయి. శాసనసభలో సీఎం ఫడ్నవీస్‌ తన బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నవంబర్‌ 27వ తేదీన సాయంత్రం 5 గంటలకు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఓపెన్‌ బ్యాలెట్‌ ద్వారానే ఫ్లోర్ టెస్ట్‌ నిర్వహించాలని, బలపరీక్ష ప్రక్రియ మొత్తం ప్రత్యేక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ రమణ నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు చెప్పింది. ప్రొటెం స్పీకర్‌ను వెంటనే ప్రభుత్వం నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రోటెం స్పీకరే బల పరీక్ష నిర్వహించాలని తెలిపింది. సభ్యుల చేత ప్రొటెం స్పీకర్‌ ప్రమాణ స్వీకారం చేయించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది.

గత శనివారం ఫడ్నవీస్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్‌ కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బలపరీక్షపై సీక్రెట్ బ్యాలెట్‌ అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. రేపటిలోగా ఎమ్మెల్యేలంతా ప్రమాణస్వీకారం చేయాలని.. ముగ్గురు స‌భ్యుల బెంచ్‌లోని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ తీర్పును చ‌దివారు. అశోక్ భూష‌ణ్‌, సంజీవ్ ఖ‌న్నాలు కూడా ఈ ధ‌ర్మాస‌నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు.. ఉత్త‌రాఖండ్‌, బీహార్ జ‌గ‌దంబికా పాల్ కేసుల‌ను ప్ర‌స్తావించింది. సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వాగతించారు.

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ సీట్లుండగా బీజేపీకి 105 సీట్లు, శివసేనకు 56 సీట్లు, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌కు 44 సీట్లు గెలిచాయి. మహారాష్ట్రలో సర్కార్‌ ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్‌ నెంబర్‌ 145. అయితే ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ రాలేదు. బీజేపీ-శివసేనలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూసిన.. సీఎం పదవి విషయంలో రెండు పార్టీల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. దీంతో శివసేన కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి కూటమిని ఏర్పాటు చేసింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శనివారం ఉదయం మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యరీతిలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య‌మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ బీజేపీకి మద్దతిచ్చారు. రాత్రికి రాత్రే మారిన పరిణామాలు ఎన్సీపీకి భారీ షాక్‌ను ఇచ్చాయి. కాగా ప్రస్తుతం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌కు కలిపి 144మంది సభ్యుల బలం ఉంది. దీంతో తామే అధికారం చేపడతామని కూటమి నేతలు అశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్సీపీలో కొందరు రెబల్స్‌ బలపరీక్ష సమయంలో ఎవరికి సపోర్ట్‌ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌లో టెన్షన్‌ మొదలైంది. ఇప్పుడు బలపరీక్ష కోసం బీజేపీకి మరో 29 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమయింది, మరీ అంతమంది ఎమ్మెల్యేలు అజిత్‌ పవార్‌ వర్గం నుంచి వస్తారా అన్న విషయం తెలియాలంటే రేపు సాయంత్రం వరకు వేచిచూడాల్సిందే.

Next Story