జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో పోలీసుల మీదకు తీవ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఆదివారం నాడు పోలీసులను టార్గెట్ గా చేసుకుని తీవ్రవాదులు గ్రెనేడ్ ను విసిరేశారు. ఈ ప్రమాదంలో ఏడుగురు సాధారణ ప్రజలు గాయపడ్డారు. త్రాల్ ప్రాంతంలోని బస్ స్టాండ్ సమీపంలో ఈ దాడి చోటు చేసుకుంది. దాడిలో గాయపడ్డ ఏడు మంది పౌరులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో అలర్ట్ అయిన భద్రతా బలగాలు.. సెర్చ్ ఆపరేషన్ ను మొదలు పెట్టాయి. వారిని పట్టుకోడానికి పోలీసులు, భారత సైన్యం ప్రయత్నిస్తోంది.
మే 26న కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. త్రాల్ ప్రాంతంలో మిలిటెంట్లు సీఆర్పీఎఫ్ సిబ్బందిపై మిలిటెంట్లు గ్రెనేడ్ తో దాడి చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు. ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదు. గత వారం బీజేపీ కౌన్సిలర్ రాకేష్ పండితను త్రాల్ ప్రాంతంలో చంపేశారు. రాకేష్ పై తీవ్ర వాదులు కాల్పులు జరిపారు. ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. ఓ స్నేహితుడిని కలవడానికి రాకేష్ పండిత వెళ్లిన సమయంలో మాటు వేసిన ముష్కరులు అతడిపై తూటాల వర్షాన్ని కురిపించారు. ఈ ఘటనలో రాకేష్ స్నేహితుడి కుమార్తెకు కూడా బుల్లెట్ గాయాలు అయ్యాయి.